Character Artist Raja Ravindra: ఒక నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజా రవీంద్ర. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే.. ఇతర హీరోల డేట్స్‌ను కూడా మ్యానేజ్ చేస్తున్నారు. అయితే కేవలం హీరోల డేట్స్ మాత్రమే ఎందుకు మ్యానేజ్ చేస్తున్నారు? హీరోయిన్స్ డేట్స్ ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు రాజా రవీంద్ర ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా హీరోగా ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్తూ.. అందుకే తాను హీరో అవ్వలేదని బయటపెట్టారు.
జయసుధ నా ఫేవరెట్..
‘‘ప్రస్తుతం వెంకటేశ్, రాజ్ తరుణ్, నిఖిల్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, జయసుధ డేట్లు చూస్తున్నాను. హీరోయిన్స్ డేట్స్ చూస్తే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. తెలుగులో నటిస్తున్న వారంతా వేరే ప్రాంతం నుండి వచ్చినవారే. హీరో అయితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తాడు. వారికి ఒక సినిమా సెట్ చేసి పెట్టేస్తే డేట్స్ చూడాల్సిన అవసరం ఏం ఉండదు. హీరోయిన్స్ అలా కాదు.. వివిధ భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తుంటారు. హీందీలో సూర్యవంశం, తమిళంలో పడయప్ప, తెలుగులో అన్నయ్య.. ఈ మూడు సినిమాల్లో సౌందర్యనే హీరోయిన్. ఆవిడ మ్యానేజర్ ఎంత టెన్షన్ అయిపోతారో అప్పుడు చూశాను. ఒకసారి సౌందర్య ఫ్లైట్ మిస్ అవ్వడంతో రజినీకాంత్‌తో సాంగ్ షూటింగ్‌కు ప్యాకప్ అయ్యింది. ఆరోజు అందరూ మాట్లాడిన మాటలు విని అప్పుడు డిసైడ్ అయ్యాను హీరోయిన్స్ జోలికి వెళ్లకూడదు అని. జయసుధ నా ఫేవరెట్ కాబట్టి గత 15 ఏళ్ల నుండి కేవలం ఆమె డేట్లు మాత్రమే చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.
లక్ష కోట్లు ఉన్నా హీరోలకు స్ట్రెస్ తప్పదు..
తను హీరో అవ్వకపోవడం గురించి కూడా మాట్లాడారు రాజా రవీంద్ర. ‘‘నేను అసలు హీరో అవుదామని రాలేదు. నేను హీరోగా ఒక సినిమా కూడా సక్సెస్ చూడలేదు. అందుకే హీరో అవుదామని ఐడియా లేదు. ఎందుకంటే చాలా టెన్షన్ ఉంటుంది హీరో అంటే. ఒక సినిమాకు సంబంధించి రిజల్ట్ అంతా హీరో మీదే పడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏ గొడవ ఉండదు. హీరో అవ్వడంకంటే అది కొనసాగిస్తూ తరువాతి లెవెల్‌కు వెళ్లడమే కష్టం. చాలా కష్టపడాలి. సినిమా రిలీజ్ అంటే హీరోలకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. సినిమా ఆడితే కెరీర్ ఒకలాగా ఉంటుంది. ఆడకపోతే ఒకలాగా ఉంటుంది. ఒకసారి అందరి పిల్లలు హీరోలు అవుతున్నారు. మీ అబ్బాయి ఉన్నాడుగా ఎందుకు హీరో చేయలేదని శోభన్ బాబును అడిగాను. శోభన్ బాబు కష్టపడతాడు, ప్రతీ సినిమా రిలీజ్ ముందు టెన్షన్ పడతాడు. శోభన్ బాబు కొడుకు కూడా ఎందుకు పడాలి అని ఆయన నాతో చెప్పారు. నా కొడుకు సూపర్ స్టార్ అయినా ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు టెన్షనే. నా కొడుకు ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నానని అన్నారు. ఒక హీరోకు లక్ష కోట్లు ఉన్నా సినిమా రిలీజ్ అంటే టెన్షన్ పడాలి’’ అంటూ హీరోలు పడే టెన్షన్ గురించి బయటపెట్టారు రాజా రవీంద్ర.
Also Read: అదే ‘హనుమాన్’ కథ, ఆ ఒక్క షాట్ కోసం రెండేళ్లు కష్టపడ్డాం - దర్శకుడు ప్రశాంత్ వర్మ