Prasanth Varma about HanuMan: సంక్రాంతి బరిలో దిగనున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ కూడా ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా ట్రైలర్ చివర్లో ఉన్న హనుమంతుడి కళ్ల షాట్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ప్రశాంత్.


ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యారు..
‘‘దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది ఆ షాట్‌ను అలా తీసుకురావడానికి. అంటే ఆ సీక్వెన్స్ మొత్తానికి అంత సమయం పట్టింది. ఒక షాట్ తర్వాత ఒక షాట్ చేయము కదా. అన్ని ఒకేసారి చేసుకుంటూ వచ్చాం. వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఆ షాట్ చూసుకున్నప్పుడు మాకు కూడా మంచి ఫీలింగ్ కలిగింది’’ అంటూ ఆ సీన్ వెనుక ఉన్న కష్టాన్ని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. అంతే కాకుండా ‘హనుమాన్’ కథ గురించి కొంచెం క్లారిటీ కూడా ఇచ్చాడు. ‘‘ముందుగా టీజర్ రిలీజ్ అవ్వకముందు ప్రేక్షకులు కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యారు. ముందుగా దీనిని ఒక యానిమేషన్ సినిమా అనుకున్నారు, 3డీ ఫిల్మ్ అనుకున్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది హనుమంతుడి కథ అనుకున్నారు. కానీ ఇది హనుమంతుడి కథ కాదు. మనందరిలాగా ఒక సాధారణ మనిషి కథ’’ అని తెలిపాడు.


ఇప్పటివరకు ఎవరూ చేయలేదు..
‘‘ఇది హనుమంతుడి భక్తుడి కథ. ఒక వ్యక్తి ధర్మం కోసం నిలబడినప్పుడు హనుమంతుడు ఎలా అతడికి సాయం చేశాడు. ఎలా తన పవర్స్‌ను ఇచ్చి ఆ వ్యక్తిని సూపర్ హీరో చేశాడు అనేది కథ’’ అని ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఈ కథపై హీరో తేజ సజ్జా కూడా స్పందించాడు. ‘‘సూపర్ హీరో అనే కథనే ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అదొక అద్భుతమైన ఐడియా కాబట్టి అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇప్పటివరకు చూడని జోనర్ సినిమాను చూడడానికి ఆసక్తి ఉంటుంది. అలాంటప్పుడు అదే కథను చేసే అవకాశం వస్తే డబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా’’ అని తనకు కథ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు తేజ.


రెండు రకాల వేరియేషన్స్..
ఇక ‘హనుమాన్’లో తన క్యారెక్టర్‌కు ఉన్న వేరియేషన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘రెండు రకాలుగా ఉంటుంది. స్టార్ట్ అయినప్పుడు బలవంతుడిలాగా, సూపర్ హీరోలాగా ఉండడు. సూపర్ హీరో సినిమాలు చిన్నప్పటి నుండి చూస్తున్నాం. తెలుగులో తెరకెక్కిన సూపర్ హీరో సినిమా కాబట్టి ఒక మామూలు కుర్రాడు, వాడి లైఫ్, వాడికి సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే విన్యాసాలు ఏంటి అనేది చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఫుల్ యాక్షన్‌తో చెప్పాం’’ అంటూ సినిమా, అందులో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలిపాడు తేజ సజ్జా. ఇక అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది.


Also Read: ‘అర్జున్ రెడ్డి’ మూవీని బన్నీతో చేయాలనుకున్నా, అందుకే విజయ్‌తో తీశా: సందీప్ రెడ్డి వంగా