Sandeep Reddy Vanga about Allu Arjun: టాలీవుడ్‌లో అప్పటినుండి ఇప్పటివరకు గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఈతరానికి బాగా కనెక్ట్ అవుతూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’లాంటి ఒక బోల్డ్ మూవీ తెరకెక్కలేదు. అందుకే ఈ సినిమా విడుదల సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమా కోసం నిలబడ్డారు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ. అయితే ముందుగా ఈ మూవీలో హీరోగా స్టైలిష్ స్టార్‌ను అనుకున్నానంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు దర్శకుడు.


‘అర్జున్ రెడ్డి’కంటే ముందే..
‘అర్జున్ రెడ్డి’ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌నే ఒక మలుపు తిప్పింది, తనను రౌడీ హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. టాలీవుడ్‌లోని యంగ్ హీరోగా టైర్ 2 స్థానం దక్కేలా చేసింది. అయితే ముందుగా ఈ మూవీలో శర్వానంద్ హీరోగా నటించాల్సింది. కానీ పలు కారణాల వల్ల తను తప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం విజయ్ చేతికి వెళ్లింది. అయితే ‘అర్జున్ రెడ్డి’ కంటే ముందు తాను ఒక వేరే కథ రాసుకున్నానని సందీప్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆ కథను ముందుగా అల్లు అర్జున్‌కే వినిపించాడట. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. అందుకే ఆ కథను పక్కన పెట్టి ‘అర్జున్ రెడ్డి’ కథను డెవలప్ చేశానని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.


అప్పుడు మిస్ అయ్యింది.. ఇప్పుడు ఛాన్స్ దొరికింది..
‘అర్జున్ రెడ్డి’ కథ పూర్తయిన తర్వాత కూడా ముందుగా అల్లు అర్జున్‌కే ఆ కథను వినిపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టానని తెలిపాడు సందీప్. కానీ తనకు ఆ అవకాశం రాలేదట. ఆ తర్వాత ఎంతోమంది నిర్మాతలను సంప్రదించినా.. ‘అర్జున్ రెడ్డి’ కథలో తనకు నచ్చని మార్పులు, చేర్పులు చెప్పడంతో ఫైనల్‌గా తానే నిర్మాతగా మారి.. విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించాడు. సందీప్ నమ్మినట్టుగానే ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక అప్పట్లో అల్లు అర్జున్‌తో మూవీ చేయడం మిస్ అయినా ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు సందీప్. ప్రస్తుతం అల్లు అర్జున్, సందీప్‌లకు ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో మూవీ ప్రారంభం కానుంది.


‘స్పిరిట్’ తర్వాతే..
ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ‘పుష్ప 2’ తప్పా మరే ఇతర సినిమాలు లేవు. ఈ మూవీ అయ్యాక తను పలువురు దర్శకులతో పనిచేస్తాడని వార్తలు వినిపించినా.. అవేమీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కొన్నాళ్లుగా ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలకు అల్లు అర్జున్ కమిట్‌మెంట్ ఇచ్చాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సందీప్ కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. కానీ బన్నీతో మూవీకంటే ముందుగా ప్రభాస్‌తో లైన్‌లో పెట్టిన ‘స్పిరిట్’ను సందీప్ పూర్తి చేస్తాడా లేదా ముందుగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేసిన తర్వాతే ప్రభాస్ దగ్గరకు వెళ్తాడా అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. అవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.


Also Read: ఏ సేఫ్టీ లేకుండా హెలికాప్టర్‌కు వేలాడి భయపెట్టాడు, ఫిట్‌నెస్ కోసం చేసే పనులివే: అక్షయ్ సీక్రెట్స్ చెప్పేసిన దర్శకుడు