Chandra Mohan final rites to be held at Panjagutta smashana vatika : సీనియర్ కథానాయకుడు, నటుడు చంద్ర మోహన్ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత పంజాగుట్ట వైకుంఠ ధామం (స్మశాన వాటిక)లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 11న (శనివారం) ఉదయం 9.45 గంటలకు హృద్రోగం సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇవాళ కన్నీటితో ఆయనకు కడసారి వీడ్కోలు పలకనున్నారు.
అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సోదరులు
చంద్ర మోహన్ అంతిమ సంస్కారాలు ఆయన సోదరులు (తమ్ముడు) మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించనున్నారు. చంద్ర మోహన్, జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందువల్ల, తమ్ముడి చేతుల మీదుగా అంత్యక్రియలు చేస్తున్నారు.
చంద్రమోహన్ లింగదారులు. వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు ఉండవు. పార్థీవ దేహాన్ని ఖననం చేస్తారు. కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తర్వాత కూడా ఆ విధంగా చేశారు. ఇప్పుడు చంద్ర మోహన్ విషయంలోనూ తమ సంప్రదాయం ప్రకారం తుది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పలువురు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు తరలి వెళుతున్నారు.
చంద్ర మోహన్ పెద్ద కుమార్తె మధుర మీనాక్షి సైకాలజిస్ట్. రెండో అమ్మాయి పేరు మాధవి. ఆవిడ చెన్నైలో సెటిల్ అయ్యారు. మధుర మీనాక్షి అమెరికాలో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె ఇండియా ప్రయాణం అయ్యారు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఆమె రచయిత్రి కూడా! డాక్టర్ గాలి బాల సుందర రావు ఏకైక కుమార్తె. ఇక, చంద్ర మోహన్ తల్లిదండ్రుల విషయానికి వస్తే... శాంభవి, మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి. వాళ్ళది కృష్ణా జిల్లాలోని పమిడి ముక్కల గ్రామం. మే 23, 1942లో ఆ దంపతులకు జన్మించిన మల్లంపల్లి చంద్ర శేఖర రావు ప్రేక్షకుల ముందుకు చంద్ర మోహన్ (Chandra Mohan)గా వచ్చారు.
Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?
చంద్ర మోహన్ వయసు 82 ఏళ్ళు అయితే... అందులో 55 ఏళ్ళకు పైగా సినిమాలు చేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆరిస్టుగా సుమారు 950కు పైగా సినిమాల్లో పలు వేషాలు వేశారు. 'రంగుల రాట్నం'తో వెండితెరకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు గాను ఆయనకు నంది అవార్డు వచ్చింది. కానీ. బ్రేక్ మాత్రమే రాలేదు. దాంతో క్యారెక్టర్ వేషాల వైపు మొగ్గు చూపారు. మళ్ళీ 'సిరి సిరి మువ్వ'తో హీరోగా ఆయనకు బ్రేక్ వచ్చింది. ఆ సినిమా దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్ ఆయనకు సోదరుడి వరుస. 'పదహారేళ్ళ వయసు'తో చంద్ర మోహన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చంద్ర మోహన్ నట ప్రయాణంలో ఆరు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు వచ్చాయి.