గ్లోబల్ లీడర్ నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన ఏం చేసినా విశ్వ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆయన పాడిన పాట తాజాగా అరుదైన నామినేషన్ ను దక్కించుకుంది. గాయకులు ఫాలు, గౌరవ్ షాతో కలిసి ప్రధాన మంత్రి మోదీ రూపొందించిన 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' సాంగ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో భాగంగా గ్రామీ 2024 అవార్డు కోసం నామినేషన్ అందుకుంది. ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగంలోని కొన్ని మాటలను ఈ పాటలో చేర్చారు. తృణ ధాన్యాల గొప్పదనాన్ని వివరించిన సాంగ్
‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట జూన్ 16న రిలీ అయ్యింది. ప్రపంచ ఆహార సరఫరాలో మిల్లెట్ ఇంపార్టెన్స్ ను ఈ పాట హైలెట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పాట విడుదలకు ముందుకు ఫాలు కీలక విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పాటను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రధాని మోడీ కనిపిస్తారని వెల్లడించారు.
మిల్లెట్స్ పై పాటను రూపొందించాలని కోరిన ప్రధాని
ఫాలుకి 2022లో గ్రామీ అవార్డు లభించింది. కలర్ ఫుల్ వరల్డ్ కోసం బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ విభాగంలో ఈ అవార్డును అందుకుంది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగానే మిల్లెట్స్ పై ఒక పాటను రూపొందించాలని ప్రధాని చెప్పారు. “మిల్లెట్స్ పై పాటలో మోడీని భాగం చేయాలని అనుకున్నాం. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే, ప్రధానితో కలిసి పాట రాసేందుకు మొదట మేం భయపడ్డాం. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. పాట మధ్యలో ప్రధాని మాటలను పొందు పరిచాం. అవే పాటకు హైలెట్ గా నిలిచాయి” అని ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ సాంగ్ రిలీజ్ ఫాలు షా దంపతులు వెల్లడించారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పాటను రూపొందించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో వచ్చే ఏడాది జనవరి 31న గ్రామీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌ను దక్షిణాఫ్రికా హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ ట్రెవర్ నోహ్ హోస్ట్ చేయనున్నారు. ఈ అవార్డుల విజేతలు ఎవరు అవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మిల్లెట్ ఫుడ్స్ ను చాలా కాలంగా ప్రమోట్ చేస్తున్న ప్రధాని
ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి నుంచి మిల్లెట్స్ ను బాగా తీసుకోవాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు. వాటితో మంచి ఆరోగ్యం లభిస్తుందని పదే పదే గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ క్యాంటీన్‌లోనూ మిల్లెట్స్ తో కూడిన స్పెషల్ వంటకాలు చేయిస్తున్నారు. విదేశీ అతిథులు భారత్ కు వచ్చినప్పుడు కూడా ఆయన మిల్లెట్స్ తో చేసిన ఫుడ్స్ రుచి చూపిస్తున్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న మిల్లెట్స్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు తన మాటలను అందించారు. ఇప్పుడు ఆ పాట గ్రామీ అవార్డుకు నామినేట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్‌కు ట్రోలింగ్ తలనొప్పి!