Medak Accident: దీపావళి పండుగ రోజున తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొంది. మెదక్ (Medak) జిల్లా ఆటో నగర్ లో స్కూటీని టిప్పర్ ఢీకొన్న ఘటనలో కవలలు మృతి చెందారు. టపాసులు కొనడానికి తల్లితో కలిసి చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హన్మకొండ (Hanmakonda) జిల్లా కాజీపేట (Kajipeta) దర్గాలోని బంధం చెరువులో కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను తట్టుకోలేక మృతురాలి అత్త గుండెపోటుతో మృతి చెందింది.


టపాసులు కొనేందుకు వెళ్తూ


మెదక్ పట్టణం ఆటోనగర్ లో అన్నపూర్ణ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవలలు పృథ్వీతేజ్ (12), ప్రణీత్ తేజ్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ తల్లి అన్నపూర్ణను స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండుగకు టపాసులు కొనేందుకు చిన్నారులు తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోంగార్డు, రెండేళ్ల క్రితమే ఆయన ప్రమాదంలో మృతి చెందారు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


తల్లీకూతుళ్ల ఆత్మహత్య


అటు, హనుమకొండ జిల్లా కాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి దర్గాలోని బంధం చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే తల్లి రేణుక (40), కూతురు నవ్య (14) చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్థుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, ఈ ఘటనను తట్టుకోలేక వృద్ధురాలైన రేణుక అత్త గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. పండుగ రోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జేసీబీ ప్రమాదంలో


ములుగు జిల్లాలో మహ్మద్ గౌస్ పల్లి శివారులోని రఘుపతిరెడ్డి క్రషర్ లో జేసీబీ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జేసీబీతో సహా 100 మీటర్ల ఎత్తు నుంచి పడి ఇద్దరు ఆపరేటర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అగ్ని ప్రమాదాలు


మరోవైపు, వరంగల్ బట్టల బజార్ లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. బట్టల బజార్ వెనుక ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో మంటలు చెలరేగి వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అటు, వనపర్తిలోనూ కొత్తకోటలో బాణాసంచా విక్రయ దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధం కాగా, ఇతర దుకాణాలకు మంటలు అంటుకున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.


Also Read: Guvvala Balaraju Discharge: 'ప్రజల దీవెనలతోనే బతికి బయటపడ్డా' - బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భావోద్వేగం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి