యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తనను నిర్మాత చేశారని, '100 పర్సెంట్ లవ్'తో తొలిసారి తెరపై తన పేరు నిర్మాతగా పడిందని 'బన్నీ' వాస్ తెలిపారు. '100 పర్సెంట్ లవ్' తర్వాత చైతన్య హీరోగా ఆయన నిర్మిస్తున్న సినిమా 'తండేల్'. డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 7కు వాయిదా వేశారు. ఈ విషయంలో అక్కినేని అభిమానులు ఎవరైనా అసంతృప్తితో ఉన్నా సరే... 'బన్నీ' వాస్ స్పీచ్ వింటే కూల్ అవుతారు. వాళ్లకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు ఆయన చెప్పారు.
వంద కోట్ల క్లబ్బులో చేరాలా కృషి చేస్తా
'తండేల్' న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'బన్నీ' వాస్ మాట్లాడుతూ... ''డిసెంబర్ 20 మా టార్గెట్. ఈ సినిమా షూట్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత పెద్ద సినిమాకు క్వాలిటీ బాగుండాలంటే సీజీ వర్క్ చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అప్పుడే మంచి ప్రొడక్ట్ వస్తుంది. పాకిస్తాన్ నావెల్ షిప్స్ చూపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ కారణాల వల్ల వాయిదా వేశాం. నాకు నిర్మాతగా '100 పర్సెంట్ లవ్' సినిమాకు అవకాశం ఇచ్చారు చైతన్య. 'తండేల్'ను 100 కోట్ల క్లబ్బులో చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను'' అని అన్నారు. 'తండేల్'ను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్బులో కూర్చోబెడతామని ఆయన పామిస్ చేశారు. తనను నిర్మాత చేసిన చైతూకు వంద కోట్ల సినిమా ఇస్తామన్నారు. ఫిబ్రవరి 7న మార్నింగ్ షో చూశాక అభిమానులు కాలర్ ఎగరేస్తారని, కాలర్ ఎత్తే సినిమాను 100% డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.
సోలో రిలీజ్ కోసమే డేట్ మార్చాం... అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ అధినేత, 'తండేల్' సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''మా సినిమా సంక్రాంతికి రావాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. కానీ మేము పెట్టిన ఖర్చుకు మాకు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఇచ్చినా తీసుకుంటుంది అంటూంటారు. కానీ ఆ టైమ్ కి థియేటర్లు వేరే సినిమాలకు షేర్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో వేయలేం. సోలో రిలీజ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీ అనుకున్నాం. ఇండస్ట్రీ పెద్దలను, డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి ఈ డేట్ ఖరారు చేయడం జరిగింది'' అని చెప్పారు.
Also Read: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. కానీ, సినిమా పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తే బాగుండేదని అనుకునేవాడిని. నటుడిగా విడుదల తేదీ ఎప్పుడో తెలుసుకోవాలని నాకు ఉంటుంది. అరవింద్ గారిని అడిగితే ముందు సినిమా చూపించమని, ఆయన అనుకున్న సినిమా వస్తే రిలీజ్ డేట్ చెప్తానని అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మామూలు సినిమా కాదిది. శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల కష్టం దేశాన్ని షేక్ చేసింది. ఆల్రెడీ మేం ఎడిట్ చూశాం. ఎప్పుడు విడుదల చేసినా పండగ తెచ్చే సినిమా అవుతుంది. ఫిబ్రవరి 7న విడుదల అవుతుండటం సంతోషం. ఇది పెద్ద సినిమా. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించడం కోసం చందూ కష్టపడ్డాడు'' అని చెప్పారు.
Also Read: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!