Chennai News: తమిళ, తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి కస్తూరీ తరచూ కాంట్రవర్సీ కామెంట్స్‌తో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చిచ్చునే రాజేశాయి. జరగబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన ఆమె తమ కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయినా ఆమెకు చిక్కులు తప్పేటట్టు లేవు.
మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన కస్తూరీ... తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. తాను కొందరి గురించే మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. తెలుగు స్నేహితులు ఒకరు తనకు పరిణామాలు వివరించారని పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ఇలా స్పందిస్తున్నట్టు వెల్లడించారు.
దేశంలోని భిన్నత్వంలో ఏకత్వంపై చాలా గౌరవం ఉందన్నారు కస్తూరి. తాను జాతీ ప్రాంతాలకు అతీతంగా ఉంటానని వెల్లడించారు. తెలుగు వారితో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు పేరు తెచ్చిపెట్టారని అన్నారు. కొందరి గురించి చేసిన కామెంట్స్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఎవరీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. తమిళనాడులోని బ్రాహ్మణుల పోరాటంలో పాలు పంచుకోవాలని తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు.
అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో కామెంట్స్ చేశారని కస్తూరిపై చెన్నై ఎగ్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద కేసు పెట్టారు. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో నవంబర్ 4న చెన్నైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మాట్లాడిన నటి కస్తూరి తెలుగు వారిని అవమానిస్తూ కామెంట్స్ చేశారు.
అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు ఇప్పుడు తామే అసలైన తమిళులం అనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కస్తూరి. తెలుగు మాట్లాడేవాళ్లకే మంత్రిపదవులు ఇస్తున్నారని అసలైన తమిళులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీంతో ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నారు.