మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో తాజాగ ఐటీ రైడ్స్ జరిగాయి. మరికొద్ది రోజుల్లో అభిషేక అగర్వాల్ నిర్మించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్ర విడుదల ఉండగా.. ఉన్నట్టుండి ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం హైదరాబాద్​లోని ఆయన కార్యాలయంలో ఈ రైడ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నిర్మాత తన రాబోయే చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు మీడియా ఏర్పాట్లకు సిద్ధమవుతున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.


అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ బాలీవుడ్​లో కూడా విడుదల కాబోతుండడం, సినిమా కోసం ఆయన ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడంతోనే ఆయన కార్యాలయాన్ని ఐటి అధికారులు సోదా చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వీరి చిత్రాలు గానీ వాటి నిర్మాణం గానీ భారీ స్థాయిలో జరుగుతూ వస్తున్నాయి. పైగా దాదాపు ఈ నిర్మాణ సంస్థ నుంచి అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే అనౌన్స్ చేస్తుండడంతో గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ వసూళ్లు.. వాటి జీఎస్​టీ తాలూకా వివరాలు కరెక్ట్​గా ఉన్నాయో లేదో అనే నేపథ్యంలో చేసి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.


మరోవైపు అభిషేక్ అగర్వాల్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా కోసం పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి సంబంధించిన లావాదేవీలు సరిగా ఉన్నాయా? ఎక్కడైనా పన్ను ఎగవేతలు లాంటివి జరిగాయా? అనే నేపథ్యంలోనే ఐటి అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం వినిపిస్తోంది. కాగా ఈ సోదాల్లో అభిషేక్ అగర్వాల్ ఖాతాలు చాలా స్పష్టంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2018లో 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' సంస్థను నిర్మించి మొదట్లో కొన్ని మీడియం రేంజ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆ తర్వాత 'గూఢచారి', 'రాజరాజ చొర' వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. దాని అనంతరం 2021లో 'కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించారు.


దాంతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ టాలీవుడ్​లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే నిర్మాత అభిషేక్ అగర్వాల్​కి బీజేపీ పార్టీ మద్దతు కూడా ఉంది. ఈయన గతంలో నిర్మించిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి భాజపా వర్గాలు సైతం మద్దతు తెలపడం విశేషం. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' విషయానికొస్తే.. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నుపూరు సనన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.


Also Read : యశ్ కి 'కేజీఎఫ్' లాంటి సినిమా పడటం అదృష్టమన్న రవితేజ - ఫైర్ అవుతున్న కన్నడ స్టార్ ఫ్యాన్స్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial