ర‌ణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా రూపొందిన మైథలాజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Part One Shiva Movie). ఆలియా భట్ కథానాయికగా, అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ప్లాన్ ప్రకారం ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. అయితే... అది క్యాన్సిల్ అయ్యింది.
 
అవును... 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది!
హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీలో 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని గత నెల 27న వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే... చివరి నిమిషంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఈవెంట్ ఆర్గనైజర్స్.


ఎందుకు క్యాన్సిల్ చేశారు?
'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనుమతులు నిరాకరించడమే కారణం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని అనుమతులు ఇవ్వలేదని సమాచారం. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలోని స్టార్ హోటల్‌లో ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారు. మీడియాతో టీమ్ అంతా ముచ్చటించనున్నారు. అనివార్య కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.


సెప్టెంబర్ 9న థియేటర్లలోకి 'బ్రహ్మాస్త్ర'
'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. హిందీలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో విడుదల అవుతోంది.
  
తెలుగులో ఈ సినిమా 'బ్రహ్మాస్త్రం' పేరుతో ఈ సినిమా విడుదల అవుతోంది. సకల అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం అంటూ సినిమా కథాంశం గురించి వివరిస్తున్నారు. హిందీ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్


'బ్రహ్మాస్త్ర' సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. మూడు భాగాలుగా సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందులో ఫస్ట్ పార్ట్ 'శివ' ఈ నెల 9న విడుదలకు రెడీ అయ్యింది. అయితే... ఇప్పుడీ సినిమాకు బాయ్ కాట్ సెగ తగులుతోందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. ఈ సినిమా నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు కావడం... హీరో హీరోయిన్లు ఇద్దరూ హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తారలుగా వెలుగొందిన వారి వారసులు కావడం అందుకు కారణం. ఈ మధ్య ఆలియా భట్ కూడా 'సినిమా చూస్తే చూడండి, లేదంటే మానేయండి' అని రియాక్ట్ కావడం కూడా బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. 


Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?