"ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?" అని ఆవేదనతో, కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నారు హీరో రాజా గౌతమ్. ఆయన కొత్త సినిమాలో డైలాగ్ ఇది. ఈ రోజు (బుధవారం, మార్చి 2) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ ఈ డైలాగ్‌తో మొదలైంది. డైలాగ్ తర్వాత రాజా గౌతమ్‌ను పరిచయం చేశారు. ఆయన చాలా కొత్తగా కనిపించారు. పాత్ర కోసం గడ్డం పెంచారు. లుక్ మార్చారు.


రాజా గౌతమ్ (Raja Goutham) కథానాయకుడిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న యస్ ఓరిజినల్స్ సంస్థ ఓ సినిమా రూపొందిస్తోంది. సృజన్ యరబోలు నిర్మాత. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజా గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ చూస్తే... ఆయన పెయిన్ ఫుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


"రాజా గౌతమ్ (Raja Goutham As Writer In S Originals Movie) రచయిత పాత్రలో నటిస్తున్నారు. మోనోఫోబియా (monophobia) తో బాధపడుతున్న ఆ రచయిత జీవితాన్ని ఓ ప్రమాదం ఎలా మార్చింది? తాను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణమైతే... దాన్ని అతను ఎలా అధిగమించాడు? అనేది సినిమా కాన్సెప్ట్" అని చిత్ర బృందం వివరించింది. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని, ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నామని దర్శక - నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్. యస్.  జోన్స్ రూపెర్ట్, సినిమాటోగ్రఫీ: మోహన్ చారి. 


Also Read: కెరీర్ అరవైల్లో మొదలు పెట్టకూడదా? వేద‌వ్యాస్‌గా బ్రహ్మానందం... 'పంచతంత్రం' టీజర్ చూశారా?