బ్రహ్మానందం (Brahmanandam) అంటే వినోదం... వినోదం అంటే బ్రహ్మానందం! కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆయన నవ్విస్తున్నారు. బ్రహ్మానందం నటించాల్సిన అవసరం లేదు... తెరపై కనిపిస్తే ప్రేక్షకుల ముఖం మీద చిరునవ్వు మెరుస్తుంది. అటువంటి ఆయనతో వినోదాత్మక పాత్ర కాకుండా... అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను 'పంచతంత్రం'లో చేయించినట్టు ఉన్నారు.


హర్ష పులిపాకను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న సినిమా 'పంచతంత్రం' (Panchathantram). ఇందులో బ్రహ్మానందం ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు బ్రహ్మానందం పుట్టినరోజు (HBD Brahmanandam) సందర్భంగా 'జర్నీ ఆఫ్ వ్యాస్' పేరుతో ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. 43 సెకన్ల ఈ టీజర్ సినిమా మీద ఆసక్తి కలిగించేలా ఉంది.


'జర్నీ ఆఫ్ వ్యాస్' (Journey Of Vyas - Panchathantram Teaser) టీజర్ చూస్తే... ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిగా, వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటించినట్టు అర్థం అవుతోంది. ఆయన కుమార్తె పాత్రలో 'కలర్స్' స్వాతి రెడ్డి నటించినట్టు తెలుస్తోంది. కథల పోటీల నుంచి వేదవ్యాస్ ఎలిమినేట్ అయితే... 'ఎలిమినేట్ అయ్యావా? నేను ముందే చెప్పాను. పార్టిసిపెంట్స్ అందరూ 30 ఏళ్ల కుర్రాళ్ళు అయ్యి ఉంటారు. నీ పాత చింతకాయ కథలు వాళ్ళకు ఏం ఆనతాయి నాన్నా!' అని కుమార్తె (స్వాతి) అంటుంది. 'ఏమ్మా! కెరీర్ అంటే ఇరవైల్లోనే మొదలు పెట్టాలా? అరవైల్లో మొదలు పెట్టకూడదా?' అని బ్రహ్మానందం ప్రశ్నించడం లేటు వయసులో కొత్త కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే వ్యక్తులు మనోభావాలను ప్రతిబింబించేలా ఉంది.


సముద్రఖని, శివాత్మికా రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి.