నో పార్కింగ్ జోన్‌లో కారును పార్క్ చేసిన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌ (Kartik Aaryan) కు ముంబై ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతడి కారుకు చలాన్ వేశారు. కార్తీక్ తన తాజా సినిమా ‘షెహజాదా’ విడుదలకు ముందు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. తన పేరెంట్స్ తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో కారును ఆలయానికి ఎదురుగా పార్క్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా 'నో పార్కింగ్ జోన్'లో కారును నిలిపి ఉంచడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వార్తలను పరిగణలోకి తీసుకుని ముంబై ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనంపై చలాన్ వేశారు.    


కార్తీక్ కారుకు ముంబై ట్రాఫిక్ పోలీసుల ఫైన్


ఈ విషయాన్ని ముంబై ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన లంబోర్ఘిని లగ్జరీ కారును షేర్ చేశారు. “ఈ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ సైడ్ లో పార్క్ చేయబడింది. ఎవరూ ట్రాఫిక్ రూల్స్ మర్చిపోకూడదు” అంటూ రాసుకొచ్చారు. ఇక హీరో కారు నెంబర్ ప్లేట్ కనిపించకుండా బ్లర్ చేశారు. అయినప్పటికీ, నంబర్ ను గుర్తించేలా కనిపిస్తోంది. పోలీసులు కార్తీక్ వాహనానికి ఎంత చలాన్ వేశారు? అనే విషయాన్ని మాత్రం వెల్లడించారు. వాహనం ఉన్న వారైనా, నటులైనా సరే, నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేస్తే, పోలీసులు తమ పని తాము చేసుకుని వెళ్తారని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి వెల్లడించారు.






ఫన్నీ కామెంట్స్ తో నెటిజన్ల సరదా!


అటు కార్తీక్ కారుకు ఫైన్ వేయడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “ఇది షెహజాదాకు ప్రమోషన్ కాదా?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీరు కారు నెంబర్ ప్లేట్ బ్లర్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ ను తెలుసుకోవడం, నటుడి పేరు కనుక్కోవడం చాలా సులభం” అని  మరొకరు స్పందించారు.   


నిరుత్సాహ పరిచిన ‘షెహజాదా’


రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ‘షెహజాదా’లో కృతి సనన్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నటుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘అలా వైకుంఠపురంలో’కు అధికారిక హిందీ రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.  ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా ప్రకారం, షెహజాదా మొదటి రోజు ₹6 కోట్లు వసూలు చేసింది. ‘షెహజాద’ తొలి రోజు నిరుత్సాహ పరిచింది. ‘మహా శివరాత్రి’, సండే వరుసగా రెండు సెలవు రోజులు రావడంతో బిజినెస్ పెరిగే అవకాశం ఉంది.  కానీ, వారాంతం లోగా కలెక్షన్లలో భారీ పెరుగుదల అవసరం” అని తరణ్ ట్వీట్ చేశాడు.


Read Also: అవన్నీ చెత్త వార్తలు, హార్మోన్‌ ఇంజెక్షన్ల ఆరోపణలపై ఎట్టకేలకు నోరు విప్పిన ఆపిల్ బ్యూటీ!