భారత్ భూభాగాలను ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది. లద్దాఖ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో వాస్తవాధీన రేఖ వెంట దురాక్రమణలకు పాల్పడుతూ ఉంది. గల్వాన్ లోయ (Galwan Valley)లో భారత్ భూభాగంలో ప్రవేశించిన చైనా ఆర్మీకి భారత్ సైనికులు ధీటైన జవాబు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఘటనపై ఓ పాన్ ఇండియా సినిమా రూపొందింది. 


భారతీయులంతా తప్పక చూడాలి - వెంకయ్య నాయుడు
'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన, ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్టు రైటరుగా పేరు తెచ్చుకున్న దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'భారతీయాన్స్' (Bharateeyans Movie). గాల్వన్ ఘటన ఆధారంగా, భారతీయ సైనికుల వీరోచిత పోరాట పటిమ చూపించేలా రూపొందింది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ కథానాయకులుగా నటించారు. ఇందులో సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలు.


'భారతీయాన్స్' చిత్రాన్ని ఆదివారం ఉదయం మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రీమియర్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ''దేశభక్తితో కూడిన చిత్రమిది. భారత దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రాన్ని యువత, ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 


చైనా వల్ల ప్రపంచమే ఇబ్బంది పడింది - కాశీ విశ్వనాథ్
తాను గతంలోనే 'భారతీయాన్స్' సినిమా చూశానని, వెంకయ్య నాయుడు గారు చూస్తున్నారని తెలిసి వచ్చానని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్ తెలిపారు. చైనా వల్ల  ప్రపంచం అంతా ఇబ్బంది పడిందని పరోక్షంగా కరోనాను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. చైనా మీద కోపం ఉన్న వాళ్ళందరూ 'భారతీయాన్స్' చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ''సమాజానికి, దేశానికి ఉపయోగపడే కంటెంట్ సినిమాలో ఉంటేనే వెంకయ్య నాయుడు గారు ప్రోత్సహించడానికి వస్తారు. ఆయన సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దేశభక్తి చిత్రమిది'' అని చెప్పారు. 


మేలో 'భారతీయాన్స్' విడుదలకు సన్నాహాలు
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాత డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి తెలిపారు. మంచి విడుదల తేదీ కోసం చూస్తున్నామని, మే నెలలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. సినిమా చూడటంతో పాటు తమ చిత్ర బృందాన్ని అభినందించిన వెంకయ్య నాయుడుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. భారతీయులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఫిలాసఫీని 'భారతీయాన్స్' ద్వారా గుర్తు చేస్తున్నామన్నారు.


Also Read : ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్


చైనా సరిహద్దుల్లో చిత్రీకరణ చేయాలని ప్రయత్నిస్తే అనుమతులు లభించలేదని, చివరకు సిక్కింలో షూటింగ్ చేశామని దర్శకుడు దీన్ రాజ్ తెలిపారు. కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలో కిషన్ రెడ్డి గారికి సినిమా చూపించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాకు పోరాటాలు : జూడో రాము, కూర్పు : శివ సర్వాణి, ఛాయాగ్రహణం : జయపాల్ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్ & కపిల్ కుమార్. 


Also Read : పవన్ కళ్యాణ్ 'ఓజీ' - 15 క్లైమాక్స్‌లు మార్చిన సుజీత్