Tollywood Actor Srikanth Meka In Bengaluru Rave Party?: ఇప్పుడు శతాధిక చిత్ర కథానాయకుడు, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ పేరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా న్యూస్ ఛానళ్లలో మార్మోగుతోంది. బెంగళూరు నగరంలో జరిగిన ఓ రేవ్ పార్టీ మీద రైడ్ చేసిన అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టుకున్న వ్యక్తుల్లో టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ సైతం ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ వ్యక్తుల్లో శ్రీకాంత్ ఉన్నారని కొందరు వార్తలు ప్రసారం చేస్తున్నారు.
శ్రీకాంత్ బెంగళూరులో లేరు!
''బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఉన్నది హీరో శ్రీకాంత్ కాదు... ఆయన హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు'' అని శ్రీకాంత్ టీం తెలుగు మీడియాకు సమాచారం అందించింది. మరికాసేపటిలో శ్రీకాంత్ వీడియో బైట్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. అభిమానులు, ప్రేక్షకుల్లో సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఇంట్లో ఉన్న శ్రీకాంత్ తన పేరు మీడియాలో రావడంతో షాక్ అయినట్లు తెలిసింది.
శ్రీకాంత్ మాట్లాడుతూ ''నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్లు ఫోనులు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్ చూశా. కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేసి వార్త రాయలేదు. కొందరు ఆ వీడియో ప్రసారం చేశారు. అది చూసి నేను, మా ఫ్యామిలీ నవ్వుకున్నాం. ఇటీవల నాకు, నా భార్యకు విడాకులు ఇప్పించారు. ఇప్పుడు ఆ రేవ్ పార్టీకి వెళ్లానన్నారు. ఆ రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి ఎవరో కొంచెం నాలా ఉన్నాడు. అతడికి కొంచెం గడ్డం ఉంది. కానీ, ముఖం కవర్ చేసుకున్నాడు. అతడిని చూసి నేనే షాకయ్యా'' అని చెప్పారు.
తాను రేవ్ పార్టీకి వెళ్లానని వస్తున్న వార్తలను దయచేసి ఎవరూ నమ్మవద్దని శ్రీకాంత్ తెలిపారు. తాను రేవ్ పార్టీలకు, పబ్బులకు వెళ్లే వ్యక్తిని కాదని, ఒకవేళ ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కాసేపు ఉండి వచ్చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సైతం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఆమె దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక వీడియో విడుదల చేశారు. తానూ హైదరాబాద్ సిటీలో ఉన్నానని స్పష్టం చేశారు.
''బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. నా పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారు. నేను హైదరాబాద్ సిటీలో ఉన్నాను. కర్ణాటక మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు'' అని హేమ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే బెంగళూరు పోలీసులు ఆవిడ ఫోటోను విడుదల చేశారు. ఫామ్ హౌసులో ఆవిడ ఆ వీడియో షూట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులకు దొరికి తర్వాత వీడియో విడుదల చేసిన హేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్ కు విమర్శకులూ సైలెంట్ అయ్యారంతే...
బెంగళూరు రేవ్ పార్టీ విషయంలోకి వెళితే...
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫాం హౌసులో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయని సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. భారీగా మద్యం బాటిళ్లతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు నటీనటులు, మోడల్స్, పలువురు యువతీ యువకులను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీకి అటెండ్ కావడం కోసం కొందరు ఫ్లయిట్ ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారట.
Also Read: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలే!
ఆ జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది అని పోలీసులు గుర్తించారట. ఆయన పేరు గోపాల్ రెడ్డి అని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం అందుతోంది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ పేరుతో ఉన్న సిక్కర్ పాస్ ఒక కారు మీద ఉండటం వైరల్ అయ్యింది. అది గడువు ముగిసిన పాస్ అని, ఆ కారుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.