'బలగం' (Balagam Telugu Movie) విడుదలకు ముందు సినిమా పాటలు పాపులర్ అయ్యాయి. శ్యామ్ కాసర్ల సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో (Music Director Bheems) బాణీలకు తోడు మంగ్లీ, రామ్ మిరియాల గానం తోడు కావడంతో 'పల్లెటూరు...', 'పొట్టి పిల్ల...' పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. దానికి తోడు దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా కావడం, సిరిసిల్లలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా రావడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. 


అసలు, ఎవరిదీ 'బలగం' కథ?
'బలగం' చిత్రంతో కమెడియన్ వేణు యెల్దండి అలియాస్ 'జబర్దస్త్' వేణు టిల్లు (Jabardasth Venu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. రెండు రోజుల ముందు ప్రీమియర్ షోలు వేశారు. మంచి రివ్యూలు వచ్చాయి. తెలంగాణ మట్టి కథ అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు సైతం మెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడీ సినిమా కథ విషయంలో కాంట్రవర్సీ నెలకొంది.
 
ప్రతి ఆదివారం 'నమస్తే తెలంగాణ' పత్రిక 'బతుకమ్మ' సంచిక తీసుకు వస్తుంది. సండే బుక్ అన్నమాట. అందులో 2014లో 'పచ్చికి' అని ఓ కథ వచ్చింది. 'పిట్టకు వెట్టుడు' సంప్రదాయాన్ని, అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసాన్ని మేళవించి జర్నలిస్ట్ కమ్ రైటర్ సతీష్ గడ్డం ఆ కథ రాశారు. తన కథలో స్వల్ప మార్పులు చేసి 'బలగం' తెరకెక్కించారని ఆయన ఆరోపించారు.


'బలగం' స్టోరీ కాంట్రవర్సీ నేపథ్యంలో ABP Desam సతీష్ గడ్డంతో మాట్లాడింది. ఈ కాపీ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ''తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇస్తూ 'బలగం' తెరకెక్కించారని తెలిసి తెలంగాణ అభిమానిగా ప్రీమియర్ షోకి వెళ్ళాను. నా కథను తెరపై చూసి ఆశ్చర్యపోయా. నా కథకు, ఆ కథకు చాలా సారూప్యతలు ఉన్నాయి'' అని తెలిపారు. 



కన్నడ 'తిథి' సంగతి ఏంటి?
కన్నడ సినిమా 'తిథి' స్ఫూర్తితో 'బలగం' తీశారని కొందరు కామెంట్ చేస్తున్నారని, ఆ విషయంలో మీరేం అంటారు? అని సతీష్ గడ్డాన్ని ప్రశ్నించగా... ''నేను కన్నడ సినిమా చూడలేదు. నా కథ చదివి, 'బలగం' సినిమా చూస్తే వాళ్ళు ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందారో అర్థం అవుతుంది. నా కథలో తాతయ్య ఉంటాడు. సినిమాలోనూ తాతయ్య ఉన్నాడు. తాత మరణం తర్వాత సంతోషంగా అంతిమ కార్యక్రమాలు చేయాలనేది, పిట్టకు వెట్టుడు అనేది కాన్సెప్ట్. నా కథ, సినిమా... రెండిటిలో హీరో మనవడు. చివరి వరకు నా కథనాన్ని ఫాలో అయ్యారు'' అని వివరించారు. 


నాకు క్రెడిట్స్ ఇవ్వాలి - సతీష్ గడ్డం
కథ విషయమై 'దిల్' రాజును గానీ, వేణునీ గానీ, చిత్ర బృందంలో ఎవరిని అయినా సరే సంప్రదించారా? అని అడగ్గా... ''లేదు అండీ. వాళ్ళను ఎలా చేరుకోవాలో నాకు తెలియదు. పెద్దవాళ్ళను చేరుకోవడం అంత సులభం కాదుగా! మీడియా ముందుకు వచ్చాను'' అని సతీష్ గడ్డం తెలిపారు. 'ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి?' అని ప్రశ్నిస్తే ''మూల కథ అని నా పేరు వేయాలి. క్రెడిట్స్ ఇవ్వాలి'' అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. 


Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?