‘బేబీ’ మూవీ ఎంత మంచి హిట్ కొట్టిందో తెలిసిందే. ఆ విజయం తప్పకుండా మూవీ టీమ్‌లో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు పలు వేదికలపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ‘బేబీ’ టీమ్ అత్యుత్సాహం కొందరిని ఇబ్బందికి గురిచేస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ‘బేబీ’ టీమ్ ఏకంగా మీడియాతోనే వాగ్వాదానికి దిగింది. అది పెద్ద గొడవగా మారడంతో ఒక జర్నలిస్ట్‌కు గాయాలు కూడా అయ్యాయి.


మీడియాపై దాడి?


ఎస్‌ఎన్‌కే నిర్మాతగా తెరకెక్కించిన రెండో సినిమా ‘బేబీ’. తన మొదటి సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’. అది మంచి హిట్ కొట్టడంతో రెండో సినిమాను తమ్ముడు ఆనంద్ దేవరకొండతో చేసి.. అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విడుదలైన మూడు వారాలు అవుతున్నా ఇంకా ‘బేబీ’కి థియేటర్లలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ‘బేబీ’ చిత్రానికి ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఈ మూవీ నడుస్తోంది. ఇది కొనసాగితే ‘బేబీ’ తప్పకుండా రూ.100 కోట్లు క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.


‘బేబీ’ మూవీ విడుదల అవ్వకముందు ప్రమోషన్స్ కోసం మాత్రమే కాదు.. విడుదలై హిట్ అయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్‌కు బయలుదేరారు. భీమవరంలో మాత్రం వారికి ఊహించని అనుభవం ఎదురైంది. గొడవ ఎవరివల్ల మొదలైందో తెలీదుగానీ.. పెద్ద రచ్చే జరిగింది. వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేబీ ప్రమోషన్స్‌లో మీడియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ‘బేబీ’ నిర్మాత మొదటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అంత అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘బాహుబలి’ తీసిన నిర్మాతలు కూడా రిజల్ట్ చూసి అంత ఓవర్ చేయలేదంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. 


ఆనంద్ దేవరకొండ యాక్టింగే హైలెట్..
‘బేబీ’ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలయ్యి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలలో నటిస్తూ ముందుకెళ్తున్నాడు. కానీ మొదటిసారి యూత్‌కు నచ్చే సినిమాలో నటించాడు. అది మాత్రమే కాదు.. నటన విషయంలో ఆనంద్ దేవరకొండ మరో మెట్టు ఎక్కేశాడని కూడా ప్రేక్షకులు ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆనంద్ పాత్రలో ఒక అమ్మాయిను పిచ్చిగా ప్రేమించే అబ్బాయిగా, ఒక లవ్ ఫెయిల్యూర్‌గా ఆనంద్ పాత్ర.. ఎంతోమంది అబ్బాయిలకు కనెక్ట్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’లాంటి ఒక లవ్ ఫెయిల్యూర్ కథతో అన్న విజయ్ దేవరకొండ అప్పట్లో సెన్సేషన్ సృష్టిస్తే.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అయిపోయి ‘బేబీ’ లాంటి లవ్ ఫెయిల్యూర్ కథతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.


Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగబలి’, పరేషన్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే..


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial