Babloo Prithveeraj: కొందరు నటులు హీరోలుగా చేసిన తర్వాత, ఆ సినిమాలు హిట్లుగా నిలిచిన తర్వాత కూడా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో బబ్లూ పృథ్విరాజ్ కూడా ఒకరు. హీరోగా, విలన్‌గా తనకు మంచి గుర్తింపు లభించిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే సెటిల్ అయిపోయారు పృథ్వి. దాని వెనుక అసలు కారణాన్ని తాజాగా బయటపెట్టారు. అంతే కాకుండా అప్పటి స్టార్ నిర్మాత రామలింగేశ్వర రావును పొరపాటున తిట్టిన సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నారు.


నిర్మాత ఫోన్ చేశారు..


సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 50కు పైగా చిత్రాల్లో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు బబ్లూ పృథ్విరాజ్. అంతే కాకుండా టీవీ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తను సీరియల్స్‌లో చేస్తున్నప్పటికీ కూడా సినిమాల్లో నటించడానికి అవకాశాల కోసం కష్టపడేవారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు పృథ్వి. అదే సమయంలో తనకు నిర్మాత రామలింగేశ్వర రావు ఫోన్ చేశారని, కానీ అది ప్రాంక్ అనుకోని ఆయనను తిట్టానని బయటపెట్టారు. ‘‘హలో నేను రామలింగేశ్వర రావును మాట్లాడుతున్నాను అన్నారు. చెప్పుతో కొడతా నీ అమ్మ అని తిట్టాను. ఇడియట్ అన్నాను. ఆ తర్వాత నిజంగా ఆయనే అని చెప్పగానే షాక్ అయ్యాను, సారీ చెప్పాను. దర్శకుడు కోడి రామకృష్ణగారు పిలుస్తున్నారని హోటల్‌కు రమ్మన్నారు అని పిలిపించి ఏం మాట్లాడకుండా పెళ్లి సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. టీవీ ప్రోగ్రామ్‌లో నా యాటిట్యూడ్ నచ్చడంతో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చాడు పృథ్వి.


ఆ అమ్మాయి హీరోయిన్ అన్నారు..


తను, నాజర్, రఘువరన్ అంతా ఒకటే బ్యాచ్ అని, అందరూ ఒకేసారి సినిమాపై ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారని చెప్పుకొచ్చారు పృథ్వి. అలాంటి సమయంలోనే తను మోడలింగ్ వైపు వెళ్లాలని అది తన కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యిందని తెలిపారు. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే విలన్‌గా తనకు మొదటి అవకాశం రాగా దాని వల్ల తనకు గుర్తింపు లభించిందని అన్నారు. అంతే కాకుండా విలన్‌గా మాత్రమే కాకుండా హీరోగా కూడా వరుసగా అవకాశాలు వచ్చాయన్నారు. ‘‘అదే సమయంలో ఒక నిర్మాత వచ్చి హీరోగా వరుస ఆఫర్లు ఇస్తానన్నారు, కానీ తన కూతురే హీరోయిన్ అన్నారు. ఆ అమ్మాయి లావుగా, చండాలంగా ఉంది. తను హీరోయిన్ ఏంటని రిజెక్ట్ చేశాను. వరుసగా 15, 20 సినిమా అవకాశాలు అలాగే పోయాయి. మళ్లీ అవకాశాల కోసం కష్టపడడం మొదలుపెట్టాను’’ అని పృథ్వి గుర్తుచేసుకున్నారు.


నాజర్ రిజెక్ట్ చేశాడు..


అప్పట్లో తాను ఒక తమిళ దర్శకుడి ఇంటి పక్కనే ఉండేవాడిని అని, రోజూ వెళ్లి కలిసేవాడిని అని చెప్పుకొచ్చారు పృథ్వి. అదే సమయంలో ఆయన చేసిన ఒక సినిమా జూనియర్ ఆర్టిస్ట్ రోల్‌లో కూడా నటించానని అన్నారు. అదే సమయంలో వేరే వ్యక్తి.. తనను విలన్‌గా గుర్తుపట్టగా ఆ తర్వాత ఆ దర్శకుడే తనకు వరుసగా విలన్‌గా అవకాశాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అలా కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ వెంటవెంటనే వచ్చాయని తెలిపారు. ఒకసారి నాజర్.. తనను పిలిపించి హీరోగా అవకాశం ఇస్తానని చెప్పి, మరుసటి రోజే తాను సీరియల్స్‌లో నటిస్తున్నాడనే కారణంతో రిజెక్ట్ చేశాడని బయటపెట్టారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి బాగా ఏడ్చానని గుర్తుచేసుకొని ఫీల్ అయ్యారు బబ్లూ పృథ్విరాజ్.


Also Read: అక్కడ మందు గ్లాస్, ఇక్కడ ప్లేట్ - ‘యానిమల్’ పాటకు అల్లు అర్హ క్యూట్ స్టెప్స్!