పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘బ్రో’. జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్స్ విషయానికి వచ్చే సరికి అనుకున్న స్థాయిలో రాలేదు. తొలి రోజు రూ. 30 కోట్లకు పైగా వసూలు కాగా, ఆ తర్వాత రోజుల్లో తగ్గిపోయాయి. రెండో రోజు రూ. రూ.18.25 కోట్లు, 3వ రోజు రూ. రూ.17.50 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజుల్లో రూ. 50.6 కోట్ల షేర్, రూ. 82.3 కోట్ల గ్రాస్ వసూళ్లను ‘బ్రో’ సాధించింది. స్టార్ హీరోల సినిమాలు మొదటి రెండు లేదంటే మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరుతున్నా, ఈ సినిమా చేరలేదు.


‘బ్రో’ వసూళ్లపై మంత్రి అంబటి సటైర్లు


ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ మూవీ కలెక్షన్స్ మీద పంచుల వర్షం కురిపించారు. తనదైన స్టైల్లో ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. “ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు! ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు !!” అంటూ ట్వీట్ చేశారు. ‘బ్రో’ సినిమాలో తన క్యారెక్టర్ ను కించపరిచడంపై ఆయన కోపంతో రగిలిపోతున్నారు. తనను ఏం చేయలేక, సినిమాలో తన పాత్రను పెట్టి శునకానందం పొందే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారాడంటూ మండిపడ్డారు.  






ఇంతకీ ‘బ్రో’ మూవీలో అబంటి గొడవేంటి?


‘బ్రో’ సినిమాలో నటుడు పృథ్వీ శ్యాంబాబు అనే క్యారెక్టర్ చేశారు. ఈ పాత్రే అసలు రచ్చకు కారణం అయ్యింది. ఇందులో శ్యాంబాబు ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. అయితే, ఈ పాత్ర మంత్రి అంబటి రాంబాబు  సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ ను పోలి ఉందని ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రో’ మూవీ నటులు, నిర్మాతలపై మండిపడ్డారు. తాజాగా ఇదే అంశంపై అంబటి రాంబాబు స్పందించారు. పండగ సందర్భంగా తాను ఆనంద తాండవం చేస్తే, సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి పవన్ కల్యాణ్ శునకానందం పొందారంటూ విమర్శించారు. “తన క్యారెక్టర్ కు సినిమాలో శ్యాంబాబు అని పెట్టడం ఎందుకు? నేరుగా రాంబాబు” అని పెడితే బాగుండేది కదా” అని నిప్పులు చెరిగారు.    


‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్, ఆలీ రెజా, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు సముద్రఖని ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం అందించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.


Read Also: అంత ఆటిట్యూడ్‌ మంచిది కాదు - ఆ హీరోపై శోభు యార్లగడ్డ షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial