టాలెంట్ ఉన్న నటీనటులు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఒక్క సరైన అవకాశం దొరికితే చాలు.. ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అవకాశాలు రాక లేదా వచ్చినా సద్వినియోగం చేసుకోలేక చాలామంది టాలెంట్ ఉన్న నటీనటులు వెనకపడిపోతుంటారు. కానీ మృణాల్ మాత్రం అలా చేయలేదు. ‘సీతారామం’తో తనకు తెలుగులో వచ్చిన మొదటి అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించడానికి సిద్ధమవుతోంది. అయితే మృణాల్ సినీ జీవితంలో ‘సీతారామం’ కంటే ముందు కూడా పలు హిట్ చిత్రాల్లో నటించింది. వాటిపై ఓ లుక్కేద్దాం..



సీతారామం
సీత అలియాస్ ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రకు ప్రాణం పోసింది మృణాల్ థాకూర్. పీరియాడిక్ సినిమాలు అనేవి హిట్ సాధించాలంటే.. అందులో ప్రేక్షకులకు నచ్చే మ్యాటర్ ఉండాలి. గత కొన్నేళ్లలో సీతారామం తరహాలో ఇంకా ఏ పీరియాడిక్ సినిమా బ్లాక్ బస్టర్‌ను అందుకోలేదు. అది కూడా ఇది కేవలం ఇద్దరి ప్రేమకథపై ఆధారపడిన సినిమా కావడం విశేషం. సీతారామం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి, వారి మనసులకు అంతగా దగ్గరవ్వడానికి దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ నటన కూడా ముఖ్య కారణమే. అప్పటివరకు మృణాల్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా.. సీత పాత్రతో తను అచ్చమైన తెలుగింటి అమ్మాయి అనిపించేలా తన నటన ఆకట్టుకుంది.




లస్ట్ స్టోరీస్ 2
సీత లాంటి పాత్ర చేసిన ఒక హీరోయిన్.. బోల్డ్ పాత్రల్లో నటించినా, ఆఫ్ స్క్రీన్ బోల్డ్‌గా కనిపించినా.. కొందరు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. ఇది చాలామంది నటీమణులకు తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయినా కూడా మృణాల్.. అవేవి పట్టించుకోకుండా బోల్డ్ స్టెప్ తీసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో మృణాల్ ఒక భాగమవ్వడం తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన కథలో మృణాల్ హీరోయిన్‌గా నటించింది. నీనా గుప్తా, అంగద్ బేడీ కూడా ఈ కథలో మృణాల్‌తో పాటు నటించారు. ఈ బోల్డ్ సిరీస్‌లో తన నటన చాలామందిని మెప్పించింది.




జెర్సీ
జెర్సీ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు ఎంతోమంది నటీమణులను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు. కానీ చివరికి ఆ అవకాశం మృణాల్‌కు దక్కింది. జెర్సీ సినిమాలో హీరో పాత్రకు ఎంత బాధ్యత ఉంటుందో.. హీరోయిన్ పాత్రకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక ప్రేమికురాలిలాగా, బాధ్యత ఉన్న భార్యలాగా రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించాల్సి ఉంటుంది. అలాంటి కాంప్లికేటెడ్ పాత్రలో మృణాల్ చాలా సులువుగా నటించిందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.


తుఫాన్
తెలుగులో చేసిన సీతారామం.. ఆ తర్వాత హిందీలో కూడా మృణాల్‌కు పలు అవకాశాలు వచ్చేలా చేసింది. అలాంటి అవకాశాల్లో ఒకటి ‘తుఫాన్’. ఇందులో హీరోగా ఫర్హాన్ అక్తర్ కనిపించాడు. డాక్టర్ అనన్య ప్రభు పాత్రలో మృణాల్ ఒదిగిపోయిందంటూ తన పాత్రకు పలు ప్రశంసలు అందాయి. ఎన్నో ఎమోషన్స్ ఉన్న పాత్ర డాక్టర్ అనన్య ప్రభు. ఆ ఎమోషన్స్ అన్నింటిని మృణాల్ తన నటనలో కనబరిచిందని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా.. తుఫాన్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అలాంటి సీనియర్ దర్శకుడితో నటించే అవకాశాన్ని మృణాల్.. చాలా త్వరగా దక్కించుకుందని బాలీవుడ్ ఆశ్చర్యపోయింది.


సూపర్ 30
మృణాల్.. బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన తర్వాత తను హీరోయిన్‌గా చేసిన సినిమాలో నటన బాగుంది అని ప్రశంసలు వచ్చినా.. తగిన గుర్తింపు మాత్రం రాలేదు. అలాంటి సమయంలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బయోపిక్‌గా తెరకెక్కిన ‘సూపర్ 30’ చిత్రంలో సుప్రియ పాత్రలో మృణాల్ నటన ఆకట్టుకుంది. ఈ మూవీలో మృణాల్ కనిపించేది కాసేపే అయినా కూడా తన డ్యాన్స్‌తో, క్యూట్ లుక్స్‌తో ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ సూపర్ 30లో మృణాల్ చేసిన పాత్రకు తగిన గుర్తింపు రాలేదని ఫీల్ అవుతుంటారు.


Also Read: దేవుడి సినిమాకు ‘అడల్ట్’ సర్టిఫికెట్ - ‘ఓ మైగాడ్ 2’ పెద్దల చిత్రమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial