వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారిపై బాధ్యత మరింత ఎక్కువగానే ఉంటుంది. తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవాలని, అన్నకు పోటీ ఇచ్చే తమ్ముడు అనిపించుకోవాలని వారసులు కష్టపడాల్సి ఉంటుంది. అలాగే యాంకర్‌గా తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లు కొనసాగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఓంకార్. మేల్ యాంకర్స్‌కు అసలు అవకాశాలు ఉంటాయా అని అందరూ సందేహపడే సమయంలో తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకున్నాడు. అలాంటి స్టార్ యాంకర్ తమ్ముడు మాత్రం హీరో అవ్వాలనుకున్నాడు. ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు.. మెల్లగా తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు.
‘హిడింబ’ ఇచ్చిన ప్రోత్సాహంతో..
ఓంకార్.. ప్రోగ్రామ్స్‌ను మాత్రమే కాదు సినిమాలను కూడా డైరెక్ట్ చేయగలడని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ముందుగా ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణంతో పాటు హీరోగా తన తమ్ముడు అశ్విన్ బాబు ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఓంకార్ దర్శకత్వంలోనే ‘రాజు గారి గది’ ఫ్రాంచైజ్‌లో నటించి మెప్పించాడు. రాజు గారి గది చిత్రం అశ్విన్ బాబు కెరీర్‌లో కీలక మార్పును తీసుకొచ్చింది. చివరిగా రాజు గారి గది 3లో హీరోగా కనిపించిన అశ్విన్.. తాజాగా ‘హిడింబ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిన్న సినిమాగా విడుదలైన ‘హిడింబ’ ప్రేక్షకులను నిరాశపరిచినా.. అశ్విన్ బాబుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మూవీ కూడా విభిన్నమైన కథతో బాగున్నా.. చూపించే విధానంలో ఇంకాస్త వర్కవుట్ చేసి ఉండే సూపర్ హిట్ అయ్యేదనే టాక్ కూడా ఉంది. అయితే, ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా.. అశ్విన్ బాబు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
అశ్విన్ బాబు తన 8వ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది మూవీ టీమ్. చేతిలో స్టెతస్కోప్‌తో రక్తంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే వచ్చినవాడు గౌతం చిత్రం మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్ ట్రాన్ఫర్మేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే అశ్విన్ బాబు కమర్షియల్ సినిమాలకు తగిన హీరోగా ఫిట్‌గా ఉంటాడు. ఇక వచ్చినవాడు గౌతం కోసం తన ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అశ్విన్ సరసన హీరోయిన్‌గా నటించేది ఎవరో ఇంకా మూవీ టీమ్ రివీల్ చేయలేదు.
క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు
వచ్చినవాడు గౌతం చిత్రాన్ని మామిడాల ఎమ్ ఆర్ కృష్ట డైరెక్ట్ చేస్తుండగా.. ఆలూరి సురేశ్ నిర్మిస్తున్నారు. షణ్ముఖ పిక్చర్స్ బ్యాన్సర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆలూరి హర్షవర్ధన్ చౌదరీ సమర్పణలో సినిమా తెరకెక్కనుంది. కెమెరా బాధ్యతలను శ్యామ్ కే నాయుడుకు అప్పగించారు. గౌరా హరీ సంగీతాన్ని అందించనున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. అబ్బూరి రవి తన డైలాగ్స్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక సినిమాలో పాటలు రాసే బాధ్యతను భాస్కర భట్ల, శ్రీమని తీసుకున్నారు.