Anchor Suma and Priyadarshi Premante Movie launch: బుల్లితెరపై యాంకర్‌ సుమ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలుగా స్టార్‌ యాంకర్‌ దూసుకుపోతున్న సుమ తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఎంతో మంది యాంకర్స్‌ వస్తున్నారు, పోతున్నారు.. కానీ సుమ మాత్రం తనకు తానే సాటి అంటూ తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఎలాంటి మూవీ కార్యక్రమమైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. ఏరి కోరి మరి ఆమెనే యాంకర్‌గా ఎంచుకుంటున్నారు ఈవెంట్‌ ఆర్గనైజర్లు. యాంకర్‌గానే కాదు వీలు చిక్కినప్పుడల్లా సుమ వెండితెరపై మెరుస్తూ అభిమానులను అలరిస్తున్నారు.


ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సుమ.. ఆమె ప్రధాన పాత్రల్లో 'జయమ్మ పంచాయతీ' అనే సినిమా చేశారు. 2022లో వచ్చిన ఈ చిత్రంలో సుమ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయిన ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో సుమ నటి సెటిలైపోతుందని, ఇక యాంకరింగ్‌ బై చెబుతుందనే వార్తలు రావడంతో ఆమె అభిమానులంతా ఆందోళన చెందారు. కానీ సుమ వాటిని పుకార్లకే పరిమితం చేశారు. మళ్లీ ఏ సినిమాలో నటించకుండా యాంకర్‌గానే అలరిస్తూ వస్తున్నారు. అయితే మరోసారి సుమ వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆమె కీలక పాత్రలో ప్రేమంటే అనే సినిమాను ప్రకటించారు. ఇందులో కమెడియన్‌ ప్రియదర్శి హీరోగా నటించారు. ఆదివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు.






ఈ సందర్భంగా మూవీ టీం ఫోటోలు షేర్ చేస్తూ చిత్రంపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. థ్రిల్లింగ్‌ రొమాంటిక్ డ్రామా వస్తున్న ఈ చిత్రంలో సుమ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీంతో కలిసి పూజా కార్యక్రమంలో సమ సందడి చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, హీరో రానాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా ముహుర్తపు సన్నివేశానికి ఫస్ట్‌ క్లాప్‌ కొట్టగా.. సందీప్‌ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. రానా సమర్పణలో ప్రేమంటే మూవీ రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్‌ మీడియా బ్యానర్లపై జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్‌ మూవీకి సంగీతం అందిస్తున్నారు.






త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని జరుపుకోనుంది. ప్రియదర్శి, ఆనంది హీరోయిన్లుగా నటిస్తుండగా.. సుమ కీలక పాత్ర పోషిస్తోంది. మూవీ ప్రకటన సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ప్రేమంటే అని టైటిల్‌ ప్రకటిస్తూ.. ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణంలో చెర్రస్‌పై రెండు టీ కప్పులతో పోస్టర్‌ ఆకట్టుకుటుంది. ఈ పోస్టర్‌తో ప్రేమంటే ఒక రొమాంటికి థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ అని అర్థమైపోతుంది. ఇప్పటికే ప్రియదర్శి హీరోగా పలు సినిమాల్లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు సుమ కనకాల కీలక పాత్రలో ప్రియదర్శి హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రకటనతోనే అంచనాలు నెలకొన్నాయి. సుమ కామెడీ పంచ్‌లు, ప్రియదర్శి సైలెంట్‌ కామెడీ... వీరిద్దరూ కలిస్తే ఆడియన్స్‌ వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుతునడంలో సందేహం లేదు. మరి వీరిద్దరు కలిసి బిగ్‌స్క్రీన్‌ ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారో చూడాలి.