ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి (Sreemukhi) సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో హిందువులు అందరికీ క్షమాపణలు చెప్పారు. అసలు ఏమైంది? ఆవిడ ఎందుకు సారీ చెప్పారు? వంటి వివరాల్లోకి వెళితే...


'సంక్రాంతికి వస్తున్నాం' వేడుకలో...
శ్రీ రామ చంద్రుడు - లక్ష్మణుల మీద!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రీ రిలీజ్ వేడుక నిజామాబాద్ పట్టణంలో జరిగింది. దానికి శ్రీముఖి యాంకరింగ్ చేశారు. ఆవిడది కూడా నిజామాబాద్.‌ ఈ సినిమాను అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని శ్రీ రామ చంద్రుడు, లక్ష్మణుల మధ్య అనుబంధంతో కంపేర్ చేయబోయారు శ్రీముఖి. అయితే ఈవెంట్ హడావిడిలో రామ లక్ష్మణులు ఫిక్షనల్ అని, దిల్ రాజు శిరీష్ రియల్ అని నోరు జారారు. 


రామ లక్ష్మణులు ఫిక్షనల్ అని చెప్పడంతో శ్రీముఖ మీద పలువురు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అలా ఎలా చెబుతారు? నీకు పురాణాలు తెలియకపోతే మౌనంగా ఉండు' అంటూ శ్రీముఖి మీద కామెంట్స్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తినే విధంగా కామెంట్స్ చేసిన శ్రీముఖి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కొందరు కోరారు. దాంతో శ్రీముఖి తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు.


నేనూ హిందువునే... క్షమించండి! - శ్రీముఖి
''అందరికీ నమస్కారం! నేను మీ శ్రీముఖి. ఇటీవల కాలంలో నేను హోస్ట్ చేసిన ఒక కార్యక్రమంలో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే. నేనూ దైవ భక్తురాలినే. అందులోనూ శ్రీ రామ చంద్రుడిని అమితంగా నమ్మేదాన్ని. నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడూ జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని అందరికీ మాటిస్తున్నాను. అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్'' అని శ్రీముఖి వీడియోలో పేర్కొన్నారు. 


Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?






''ఉద్దేశపూర్వకంగా ఎవరు కావాలని రామ లక్ష్మణుల మీద కామెంట్స్ చేయరు. ఏదో తెలియక అన్నావు, క్షమాపణలు కోరుతున్నావు. ఇది చాలు నువ్వేంటో తెలియడానికి'' అంటూ శ్రీముఖికి మద్దతుగా ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ హిందువుల మీద జోకులు వేసి సారీ చెప్పడం కామన్ అయిపోయిందంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీముఖి పోస్ట్ చేసిన వీడియో కింద రామ లక్ష్మణులు కల్పిత పాత్రలు అంటూ, బ్రాహ్మణులు రాసిన కల్పిత కథలోని కల్పిత పాత్రలపై కామెంట్స్ చేసి సారీ చెప్పాల్సిన అవసరం లేదంటూ మరొక నెటిజన్ వివాదాస్పద కామెంట్ చేయడం గమనార్హం.


Also Readరామ్ చరణ్ కీలక నిర్ణయం... అభిమానుల మృతితో 'గేమ్ చేంజర్' చెన్నై ఈవెంట్ క్యాన్సిల్, ఇంకా ఏం చెప్పారంటే?