నో మోర్ 'గేమ్ ఛేంజర్' పబ్లిక్ ఈవెంట్స్... సినిమాకు సంబంధించి ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ మీట్లలో తాను పాల్గొనేది లేదని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెలిపారని తెలిసింది. ఇటీవల తన సినిమా వేడుకకు వచ్చిన అభిమానులు ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆయన చెప్పారట.
గ్లోబల్ స్టార్ హృదయాన్ని బరువెక్కించిన ఘటన
రామ్ చరణ్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి? అని ఆలోచిస్తే... ఆయన హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ వేడుక రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) వచ్చారు. బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు వడిశలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యాన్ వాళ్ళ బండిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి వెళుతున్న సమయంలో ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. వాళ్ళిద్దరి మృతి రామ్ చరణ్ గుండెల్ని పిండేసింది.
అభిమానుల మృతికి గౌరవసూచకంగా...
Ram Charan was devastated by the loss of fans Manikanta and Charan: తోకాడ చరణ్, ఆరవ మణికంఠ మృతితో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆ ఇద్దరి జ్ఞాపకార్థం, వారి మృతికి గౌరవసూచకంగా 'గేమ్ ఛేంజర్' ఫంక్షన్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ చేసినట్లు 'గేమ్ చేంజర్' యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చెన్నైలో ఒక భారీ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు. అలాగే, నార్త్ ఇండియాలో మరొక ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ ఇద్దరు మృతి చెందడంతో ఆ రెండు ఈవెంట్స్ క్యాన్సిల్ చేయమని రామ్ చరణ్ యూనిట్ వర్గాలకు స్పష్టం చేశారు. అభిమానుల సంక్షేమం దృష్ట్యా రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Also Read: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో
సినిమా విషయానికి వస్తే... సుమారు ఆరేళ్ళ తర్వాత 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులలో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ''ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో? 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ అదే చేశారు'' అంటూ ఎస్.జె. సూర్య చెప్పిన మాటలు అందరిలో ఆసక్తి రేపాయి. ట్రైలర్ విడుదల తర్వాత మైనింగ్, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక తవ్వకాలు వంటి అంశాలు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది, మరి, దర్శకుడు శంకర్ వాటిని ఎలా డీల్ చేశారో చూడాలి.