Mythri Movie Makers: టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లలో 'మైత్రీ మూవీ మేకర్స్' ఒకటి. ఈ బ్యానర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వై. రవి శంకర్, నవీన్ యెర్నేని కలిసి ఓవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే, మరోవైపు మీడియం రేంజ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి అభిరుచి గల  నిర్మాతలు అనిపించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న మైత్రీ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. చిన్న మీడియం రేంజ్ చిత్రాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'గం గం గణేశా', 'సత్యభామ' వంటి సినిమాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారు.


యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'గం. గం.. గణేశా'. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ ఫ‌న్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి & వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మించారు. ఇప్ప‌టికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మే 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హాక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


'గం. గం.. గణేశా' సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ధియేటర్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద‌క్కించుకుంది. ఇది వరకే ఈ సినిమా నుంచి వచ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు ఆకట్టుకున్నాయి. 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ కావడంతో అందరిలో మంచి అంచనాలున్నాయి. ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించగా.. ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌లు పోషించారు.






ఇదిలా ఉంటే 'సత్యభామ' సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను కూడా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, జూన్ 7వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇందులో కాజల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. 'మేజర్' దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించడమే కాకుండా, స్క్రీన్ ప్లే సమకూర్చారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. రీసెంట్ గా రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. నందమూరి బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరై, కావాల్సినంత బజ్ తీసుకొచ్చి పెట్టారు.






ఇలా వారం గ్యాప్ లో 'గం గం గణేశా', 'సత్యభామ' లాంటి రెండు చిన్న సినిమాలను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. గతేడాది 'సలార్ పార్ట్ 1', 'హను-మాన్' వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలు ఆర్జించిన నిర్మాతలు.. ఇటీవల కాలంలో 'మంజుమ్మెల్ బాయ్స్' 'ఆడు జీవితం - ది గోట్ లైఫ్' 'లవ్ గురు' లాంటి డబ్బింగ్ చిత్రాలను కూడా తెలుగు ఆడియెన్స్ కు అందించారు. రానున్న రోజుల్లో మరికొన్ని చిత్రాలను పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద మైత్రీ మేకర్స్ కాస్త ఆలస్యంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టినప్పటికీ, చాలా తక్కువ టైంలోనే ఇతర పంపిణీ సంస్థలకు ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోందని చెప్పాలి. 


Also Read: మలయాళ చిత్రాల్లో మహిళల ప్రాధాన్యత తగ్గుతోందా?