సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటనలో ఒక ప్రత్యేక స్టైల్ ఉంటుంది. అదే ఆయన్ను సూపర్ స్టార్ ను చేసింది. పాన్ ఇండియా ట్రెండ్ లేనప్పుడే రజనీకాంత్ సినిమాలు దేశవ్యాప్తంగా విపరీతంగా చూసేవారు ప్రేక్షకులు. రజనీకాంత్ కెరీర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో ‘శివాజీ’ సినిమా ఒకటి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. 2007లో గ్రాండ్‌గా విడుదలైప ఈ మూవీ అత్యధిక కలెక్షన్లను సాధించింది. ఆ ఏడాదిలోనే పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రజినీకాంత్ నటనకు తమిళనాడు ప్రభుత్వం ‘ఉత్తమ నటుడు’ అవార్డు అందించింది. అయితే, ఆ మూవీ ఇప్పుడు మరోసారి చర్చనీయంగా మారింది. ముఖ్యంగా ఆ అవార్డుకు రజినీకాంత్ అర్హుడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఆజ్యం పోసింది మరెవ్వరో కాదు.. ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్. ఈ సినిమాలో నటించిన రజనీకాంత్ కు ఉత్తమ నటుడు అవార్డులు ఇవ్వడం పట్ల సుల్తాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రజినీ  ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన అమీర్ సుల్తాన్.. ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు. ‘పరుత్తివీరన్’, ‘ఆది భగవాన్’ వంటి హిట్ సినిమాలకు దర్శకుడిగా చేశారు. ఆయనకు దర్శకుడిగా తమిళంలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన తాజాగా ‘శివాజీ’ సినిమాకు ఉత్తమ నటుడిగా రజనీకి అవార్డు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ కు ఆ అవార్డు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. అసలు ఆ అవార్డుకు ఆయన అర్హుడేనా అని ఎద్దేవా చేశారు. ఆయన టాలెంట్ గురించి తాను ఏమీ మాట్లాడననీ, అయితే ఆ సంవత్సరం అతని కంటే బాగా చేసిన హీరోలు లేరా? అని వ్యాఖ్యానించారు. 


ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. అమీర్ సుల్తాన్ 2007 లో ‘పరుత్తివీరన్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా తమిళ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది. అయితే ఆయన ఈ సినిమాను దృష్టిలో ఉంచుకొనే ఈ వ్యాఖ్యలు చేశారు అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. కాగా అమీర్ సుల్తాన్ ఉన్నట్టుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.


రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. అలాగే మోహన్ లాల్, రమ్యకృష్ణ కూడా కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఆయన కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సలాం’ సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు పలు ప్రాజెక్టులు చేయనున్నారు రజినీ. 


Also Read 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?