Allu Arjun visits Shri Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు (జనవరి 7, మంగళవారం) ఉదయం సికింద్రాబాద్ ఏరియాలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు, ఆ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించారు.
మీడియాతో మాట్లాడకుండా ఇంటికి!
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒకవేళ అల్లు అర్జున్ గనుక కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ఉద్దేశం ఉంటే తమకు ముందుగా సమాచారం అందించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన అల్లు అర్జున్... ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీ తేజ్ దగ్గరకు వెళ్లారు.
కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో అక్కడికి పెద్ద ఎత్తున మీడియా చేరుకుంది. అయితే... ఎటువంటి మీడియా మీట్ లేకుండానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. కేవలం రేవతి కుమారుడు, ఆమె కుటుంబ సభ్యుల పరామర్శకు మాత్రమే పరిమితం అయ్యారు.
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తాడని తెలిసిన పోలీసులు మరొక సారి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వంటివి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాకు అటు అల్లు అర్జున్, ఇటు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. అయితే విషయం బయటకు రావడంతో కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు.
రేవతి కుటుంబానికి బన్నీ కోటి రూపాయల సాయం... టోటల్ 2 కోట్లు
'పుష్ప ది రూల్' పెయిడ్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, అభిమానులు పోటెత్తడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయడం, ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం వంటి విషయాలు తెలిసినవే. ఆ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా పోలీసులు చేర్చగా... అందులో అల్లు అర్జున్ ఏ11. ఆయనను అరెస్టు కావడంతో పాటు బెయిల్ మీద బన్నీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ ఘటన తమన ఎంతగానో కలచివేసిందని బన్నీతో పాటు పుష్ప 2 చిత్ర బృందం తమ ప్రాగాడ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు సుకుమార్ 50 లక్షల రూపాయల, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరొక 50 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం మీద రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల సాయం అందుతోంది.