అల్లరోడు ఈజ్ బ్యాక్! మళ్లీ వినోదంతో ప్రేక్షకులను నవ్వించడానికి 'అల్లరి' నరేష్ రెడీ అయ్యారు. ఈ మధ్య 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' అంటూ సీరియస్ సినిమాలు చేశారు ఆయన. 'నా సామి రంగ'లో ప్రేక్షకులకు వింటేజ్ నరేష్ కనిపించారు. అయితే, ఆ క్యారెక్టర్ ఎండింగ్ కొందరికి నచ్చలేదు. అయితే, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో 'అల్లరి' నరేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
'ఆ ఒక్కటీ అడక్కు' అంటోన్న నరేష్!
ఆ ఒక్కటీ అడక్కు... ఈ టైటిల్ వింటే నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్లాసిక్ ఫిల్మ్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన తనయుడు 'అల్లరి' నరేష్ ఆ టైటిల్ (Aa Okkati Adakku)తో సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 61వ చిత్రమిది. ఈ రోజు సినిమాను అనౌన్స్ చేశారు. అలాగే, టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
పాన్ ఇండియా ప్రాబ్లమ్... పెళ్లి నేపథ్యంలో!
ఆ ఒక్కటీ అడక్కు - ఏది అడక్కూడదు? అంటే... 'పెళ్లి ఎప్పుడు?' అని నరేష్ అంటున్నారు. పాన్ ఇండియా ప్రాబ్లమ్ పెళ్లి నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు.
'ఆ ఒక్కటీ అడక్కు'లో గణ పాత్రలో నరేష్ నటిస్తున్నారు. ఇంట్లో ఆయన పెద్దోడు. అపార్ట్‌మెంట్‌లో ఇరుగు పొరుగు అందరూ 'పెళ్లి ఎప్పుడు?' అని వివిధ భాషల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు 'మనది పాన్ ఇండియా సినిమానా?' అని 'వెన్నెల' కిశోర్ అడిగితే... పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద సినిమా అని నరేష్ సమాధానం ఇచ్చారు. సినిమా కాన్సెప్ట్, కామెడీని 85 సెకన్ల వీడియోలో చూపించారు.
నరేష్ జోడీగా ఫరియా అబ్దుల్లా...
థియేటర్లలో విడుదల చేసేది ఎప్పుడంటే?
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో అల్లరి నరేష్ సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, అరియనా గ్లోరీ ఇతర ప్రధాన తారాగణం.
Also Read: దసరా బరిలో దేవర... కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్!
'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాన్ని మార్చి 22న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు టైటిల్ గ్లింప్స్ విడుదల చేసినప్పుడు తెలిపారు. ఈ చిత్రానికి కళా దర్శకుడు: జేకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సూర్య, రచన: అబ్బూరి రవి, సంగీతం: గోపి సుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాత: రాజీవ్ చిలక, దర్శకత్వం: మల్లి అంకం.