Naa Saami Ranga 4 Days Collections: కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఫెస్టివల్ సీజన్ ని బాగా క్యాష్ చేసుకొంది. రోజు రోజుకూ ఆక్యుపెన్సీని పెంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 8.6 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ. 9.2 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు రూ. 7.0 కోట్లు వసూలు చేయగలిగింది. ఇక వీక్ డేస్ లోనూ డామినేషన్ చూపించిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. 


సంక్రాంతి బరిలో మూడు సినిమాలతో పోటీ పడిన ‘నా సామిరంగ’.. ప్రపంచ వ్యాప్తంగా లిమిటెడ్ థియేటర్లలోనే రిలీజ్ అయింది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు బాగుండటంతో రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా హాళ్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. ఫలితంగా 4వ రోజు థియేటర్ల నుంచి రూ. 3.17 కోట్ల షేర్ వసూలైంది. తెలుగు రాష్ట్రాల నుంచే ఈ నాలుగు రోజుల్లో రూ. 15.63 కోట్లు షేర్ రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ. 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ అందుకున్న ఈ సినిమా, ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.3 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 


‘నా సామిరంగ’ సినిమా ఇప్పటికే సీడెడ్, గుంటూరు, ఉత్తరాంధ్ర ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి, ప్రాఫిట్స్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో పొంగల్ హాలిడేస్ పొడిగించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నాగార్జున గతంలో సంక్రాంతి సీజన్ లో 'మజ్ను', 'కిల్లర్' 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' వంటి హిట్లు అందుకున్నారు. ఇప్పుడు ‘నా సామిరంగ’ విజయంతో మరోసారి 'సంక్రాంతి హీరో' అనిపించుకున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో ‘నా సామిరంగ’ 4వ రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ పరిశీలిస్తే...
నైజాం – 85 లక్షలు
సీడెడ్ – 51 లక్షలు
వైజాగ్ – 47 లక్షలు
ఈస్ట్ – 42 లక్షలు
వెస్ట్ – 21 లక్షలు
కృష్ణ – 23 లక్షలు
గుంటూరు – 31 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు
4వ రోజు షేర్ – 3.17 కోట్లు
AP & TS షేర్ (4 డేస్) – 15.63 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 30.3 కోట్లు


రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరక్టర్ గా పరిచయం అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా నాగార్జునను ఊర మాస్ గెటప్ లో, వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇందులో నాగ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్సింగ్ రోజ్ షబ్బీర్, నాజర్, రావు రమేష్, మహేష్ ఆచంట తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 


‘నా సామిరంగ’ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సమకూర్చిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. బెజవాడ ప్రసన్న కుమార్ మాటలు రాయగా, చంద్రబోస్ పాటలు రాశారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ నిర్వహించగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ చేసారు. స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, వెంకట్, పృథ్వి మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.


Also Read: 'గేమ్ ఛేంజర్' అప్డేట్: దసరాని టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్?