ఇటీవల ‘కస్టడీ’ సినిమాతో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో చైతూ సినిమా చేస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ ప్రాజెక్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి, నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  సినిమా నేపథ్యం, హీరో పాత్ర ఏంటనేది రివీల్ చేసారు. 


బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ నాగచైతన్యతో ఉంటుందని తెలిపారు. ''అందులో హీరో క్యారక్టర్ తండేలుగా కనిపిస్తాడు. బోట్స్ నడిపే వారిని 'తండేలు' అని అంటారు. అది చాలా పాత పదం. గుజరాత్‌ లోని సూరత్ లో ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ఒక అందమైన ప్రేమకథ.. ఊహించని ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. అలాంటి బోట్ డ్రైవర్ క్యారక్టర్ లో చైతన్య నటించనున్నారు. సినిమా అంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దీని కోసం చాలా రీసెర్చ్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది'' అని బన్నీ వాసు చెప్పారు. 


నాగచైతన్య ఇప్పటివరకూ తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఓవైపు మాస్, మరోవైపు క్లాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇంతవరకూ బోట్ డ్రైవర్ వంటి వైవిధ్యమైన పాత్రను పోషించలేదు. అందులోనూ ఇది నిజజీవిత పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా రా అండ్ రస్టిక్ గా ఉండే అవకాశం ఉంటుంది. తండేలు పాత్ర కాబట్టి అతని హావభావాలు, స్లాంగ్ కొత్తగా ఉంటాయి. నిర్మాత బన్నీ వాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఇది తప్పకుండా చై కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


'బంగార్రాజు' వంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య 'థాంక్యూ'  సినిమా డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న కస్టడీ' మూవీ కూడా నిరాశ పరిచింది. దీంతో అక్కినేని వారసుడు తదుపరి చిత్రంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ లాంటి సక్సెస్‌ ఫుల్ బ్యానర్‌ తో చేతులు కలపడం అభిమానుల్లో విశ్వాసాన్ని పెంచింది. ఎందుకంటే గతంలో ఇదే బ్యానర్ లో చేసిన '100% లవ్' మూవీ చైతూ కెరీర్ ని గాడిలో పెట్టింది. అందుకే ఈసారి అదే సెంటిమెంట్ తో మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నారు. 


అందులోనూ ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘కార్తికేయ 2’ సినిమాతో చందూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అతని తదుపరి ప్రాజెక్ట్ ఏంటని అందరిలో ఆసక్తి నెలకొంది. చైతూతో చందు గతంలో 'ప్రేమమ్' 'సవ్యసాచి' వంటి సినిమాలను రూపొందించారు. ఇప్పుడు వీరిద్దరో కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.


Read Also: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?