సినీ ఇండస్ట్రీలో 'సెంటిమెంట్స్' ను బలంగా నమ్మేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమా మొదలు పెట్టడం దగ్గర నుంచి, రిలీజ్ వరకూ అన్నీ సెంటిమెంట్స్ ప్రకారమే జరుగుతుంటాయి. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల టైటిల్స్ విషయంలోనూ గత కొంతకాలంగా ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. అతను ఏ హీరోతో మూవీ చేసినా, టైటిల్ మాత్రం 'అ' అనే అక్షరంతోనే మొదలవుతుంది. 


త్రివిక్రమ్ కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబుతో 'అతడు' వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించారు. పవన్ కల్యాణ్ హీరోగా 'అత్తారింటికి దారేది' అనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 'అ ఆ' తో సక్సెస్ సాధించిన దర్శకుడు, అప్పటి నుంచీ ప్రతీ చిత్రానికి 'అ' అక్షరంతో మొదలయ్యే టైటిల్ నే సెంటిమెంట్ గా పెడుతూ వచ్చారు. అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలు అలానే వచ్చాయి. కానీ ఇప్పుడు మహేష్ లేటెస్ట్ సినిమాకు మాత్రం త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను ఫాలో అవ్వలేదు.


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి 'గుంటూరు కారం' అనే టైటిల్ ను ఖరారు చేసారు. నటశేఖర కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ను అనౌన్స్ చేసి, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ ఊర మాస్ లుక్, బీడీ తాగడం, ఇంతకు ముందెన్నడూ చూడని స్లాంగ్ లో డైలాగ్ చెప్పడం వంటివి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 


ఇదంతా బాగానే వుంది కానీ, టైటిల్ విషయంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ‘అతడు’ తర్వాత అప్పట్లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ‘ఖలేజా’ సినిమా బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. మళ్లీ ఇప్పుడు తన ‘గుంటూరు కారం’ అంటూ వస్తున్నారు. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను పక్కన పెట్టడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అయితే త్రివిక్రమ్ గతంలో 'అ' టైటిల్ తో తీసిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ గా మారితే.. టైటిల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రూపొందించిన 'జల్సా', 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు హిట్లుగా నిలిచాయి. కాబట్టి టైటిల్ సెంటిమెంట్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూపర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 


నిజానికి SSMB28 సినిమాకు కూడా 'అ' అనే అక్షరంతోనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావించారు. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ ను అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ మాస్ యాక్షన్ అప్పీల్ ఉన్న క్యారెక్టరైజేషన్ కు అది సాఫ్ట్ టైటిల్ అవుతుందని, అందుకే ఆఖరి నిమిషంలో 'గుంటూరు కారం' టైటిల్ కే మేకర్స్ మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైతేనేం ఇది మహేశ్ సినిమాకు సరైన టైటిల్ ను ఫ్యాన్స్ భావిస్తున్నాను. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ కొడుతుందో 2023 సంక్రాంతి వరకూ వేచి చూడాలి.


కాగా, 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.