అఖిల్.. నడవడం, మాట్లాడటం రాని రోజుల్లోనే తెరంగేట్రం చేసిన హీరో. తన బోసి నవ్వులతో, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సిసింద్రీగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అక్కినేని మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ అఖిల్ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 8). సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉండే యూత్ స్టార్ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ.. ఆయన సినీ ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం!
కింగ్ అక్కినేని నాగార్జున, అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కేవలం ఏడాది వయసులోనే 1995లో 'సిసింద్రీ' అనే సినిమాలతో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి విజయం సాధించడమే కాదు, అఖిల్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2014లో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీగా నిలిచిన 'మనం' లో గెస్ట్ రోల్ లో తళుక్కుమన్నాడు.
ఇక అప్పటికే తన సోదరుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా రాణిస్తున్న టైంలో.. 2015లో 'అఖిల్' సినిమాతో అఖిల్ హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినప్పటికీ డెబ్యూ హీరోగా అఖిల్ భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అలానే అక్కినేని వారసుడి స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ తో రెండో సినిమాగా 'హలో' అంటూ పలకరించాడు అఖిల్. 'ఏవేవో కలలు కన్నా..' అంటూ సింగర్ గా మారాడు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో, సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇదే క్రమంలో వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా అక్కినేని హీరోని నిలబెట్టలేకపోయింది.
అఖిల్ తన శక్తినంతా ధారపోసినా, టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినా.. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆశించిన సక్సెస్ అందకపోవడం దురదృష్టమనే అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం అఖిల్ కు కాస్త ఊరట నిచ్చింది. 50 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ రుచి చూపించింది.
ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్.. ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి 'ఏజెంట్' సినిమాతో వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అక్కినేని వారసుడు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఈ ఏప్రిల్ 28న రాబోతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈరోజు అఖిల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కప్ గెలుచుకున్న యూత్ కింగ్.. ఏజెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకొని సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగించాలని కోరుకుందాం.