టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బన్నీ ఎంతో కష్టపడ్డాడు. యాక్టింగ్, డాన్సులతోనే కాకుండా, స్టైలింగ్ లోనూ తన స్పెషాలిటీ చూపించాడు. కేవలం తెలుగులోనే కాకుండా, పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న బన్నీ.. ఈరోజు (ఏప్రిల్ 8) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. అంతేకాదు ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 20 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారే వరకూ అల్లు అర్జున్ సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

 

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. హీరోగా లాంచ్ అవ్వడానికి ముందే పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. 'విజేత' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బన్నీ.. 'స్వాతిముత్యం' సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక 18 ఏళ్ళ వయసులో 'డాడీ' మూవీలో డాన్సర్ గా నటించి, అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత 2003 లో 'గంగోత్రి' సినిమాతో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అల్లు అర్జున్ హీరోగా డెబ్యూట్ చేశాడు. ఈ సినిమా మార్చి 28వ తేదీ నాటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

 

టాలీవుడ్ లో తొలి అడుగే సక్సెస్ ఫుల్ గా వేసిన అల్లు వారబ్బాయి.. సినిమా సినిమాకి నటన పరంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'ఆర్య' చిత్రం అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యేలా చేసింది. వీవీ వినాయక్ తో కలిసి చేసిన 'బన్నీ' పర్వాలేదనిపించగా.. కరుణాకరన్ డైరెక్షన్ లో నటించిన 'హ్యపీ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'దేశముదురు' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడమే కాదు.. అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ ను, స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది.

 

'పరుగు' సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన బన్నీ.. 'ఆర్య 2' తో స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని సుస్థిరం చేసుకున్నారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు, బద్రీనాథ్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. 'వేదం' చిత్రం నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టగా..  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన 'జులాయి' మూవీ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఇక 'ఎవడు' చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

 

2014 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'రేసుగుర్రం' బన్నీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఇది ఆయనకు ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా చెప్పబడింది. ఆ తరువాత 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. సరైనోడుతో ఊర మాస్ అంటే ఏంటో చూపించాడు. ఈ క్రమంలో రుద్రమదేవి చిత్రంలో గెస్టుగా చేసిన స్టైలిష్ స్టార్.. 'డీజే: దువ్వాడ జగన్నాధం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ వెంటనే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది. దీంతో రెండేళ్ల గ్యాప్ తీసుకుని 'అల వైకుంఠపురంలో' సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ తెలియజెప్పాడు. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు. 

 

అల.. తరువాత వచ్చిన 'పుష్ప' సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ తో కలసి చేసిన ఈ హ్యాట్రిక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారడమే కాదు, సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'పుష్ప: ది రూల్' కోసం సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన గ్లింమ్స్ & ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. 

 

అల్లు అర్జున్ 'ఆర్య' నుంచి ప్రతీ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ మార్కెట్ ను విస్తరించుకున్నాడు. ముఖ్యంగా కేరళలో మలయాళ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. తమిళంలోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ మీద దృష్టి సారించి సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకూ అల్లు అర్జున్ 3 నంది అవార్డులు, 6 ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులతో పాటు ఒక ఐఫా ఉత్సవ్ పురస్కారాన్ని అందుకున్నాడు. 'పుష్ప' తర్వాత పలు పాపులర్ మ్యాగజైన్స్ కవర్ పేజీల మీదకి ఎక్కాడు బన్నీ. ఇలా టాలివుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ ఇలానే సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటూ.. 'ABP దేశం' ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.