రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే అంటుంటారు. నీ ప్రయాణం సాఫీగా సాగి, అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే ఒక దాని మీదనే ద్రుష్టి పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. అలా కాదని తమకు అన్ని విషయాల్లో ప్రావీణ్యం ఉందని, ఒకేసారి రెండు మూడు అంశాలపై ఫోకస్ పెడితే మాత్రం మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొందరు డైరెక్టర్లు ఓవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే మరోవైపు ప్రొడక్షన్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. తాము డైరెక్ట్ చేసే సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకంటూ.. పోస్టర్స్ మీద ప్రొడ్యూసర్ & డైరెక్టర్ గా పేర్లు పడేలా చూసుకుంటున్నారు. సినిమా హిట్టయితే ఎవరూ దీన్ని పట్టించుకోరు కానీ.. ప్లాప్ అయితేనే అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు.
టాలీవుడ్ లో స్టైలిష్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. ఇప్పుడు 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. పూర్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇది బాక్సాఫీస్ వద్ద ప్లాప్ దిశగా పయనిస్తుండంతో, నిర్మాత భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనికి బాధ్యుడు ఎవరంటే అన్ని వేళ్ళూ ఇప్పుడు డైరెక్టర్ వైపే చూపిస్తున్నాయి.
'ఏజెంట్' సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే దర్శకుడు సూరి తన సరెండర్2సినిమా సంస్థను కూడా నిర్మాణంలో భాగం చేసారు. ప్రొడక్షన్ లో ఎంత డబ్బులు పెట్టారు? తన రెమ్యునరేషన్ ను పెట్టుబడిగా పెట్టారా? అనేది తెలియదు కానీ.. ఆయన భార్య దీప పేరు సహ నిర్మాతల్లో ఉంది. హీరో అఖిల్ దాదాపు మూడేళ్ళ పాటు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ రిజల్ట్ మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. డైరెక్టర్ స్టోరీ - స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ తీసుకోకుండా.. నిర్మాణంలో దూరి డబ్బుల లెక్కలు చూసుకోవడం వల్లనే ఇలాంటి ప్రోడక్ట్ బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఇంతకముందు డైరెక్టర్ కొరటాల శివ విషయంలోనూ ఇదే జరిగింది. 'ఆచార్య' సినిమాకు ఆయన దర్శకుడు అయినప్పటికీ.. మేకింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి అంశంలో అన్నీ తానై వ్యవహరించారు. నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమా బిజినెస్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉండరు కాబట్టే, తాను ఇదంతా చూసుకోవాల్సి వచ్చిందని కొరటాల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ కావడమే కాదు, దర్శకుడిగా కొరటాల శివ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకు ముందు డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా తన సినిమాల బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవారు.
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం తన సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటారనే సంగతి తెలిసిందే. గతేడాది పూరీ కనెక్ట్ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ హీరోగా తీసిన 'లైగర్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో పూరీతో పాటుగా VD కూడా నెగెటివిటీ పేస్ చేయాల్సి వచ్చింది. ఇటీవల సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ సైతం 'శాకుంతలం' సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి, భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్ రాజు.. ఇది తన 20 ఏళ్ళ కెరీర్ లో అతి పెద్ద జర్క్ అని అన్నాడంటే, ఆయనకు ఎంత నష్టం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!
ఇలా స్టార్ డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్ గా ప్లాప్స్ అందుకున్నారు. స్క్రిప్ట్ మీద కంటే తమ సొంత బ్యానర్ ను ప్రమోట్ చేసుకొని డబ్బులు చేసుకోవాలని చూడటం వల్లనే అలాంటి సినిమాలు వచ్చాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీని వల్ల వారి కెరీర్ ఎలా ఉన్నా, హీరోల ఇమేజ్ మరియు మార్కెట్ పై ప్రభావం పడుతోందని అంటున్నారు. ఇప్పటికైనా మన దర్శకులు క్రియేటివిటీ సైడ్ కాన్సన్ట్రేట్ చేయాలని, కథ మీద కసరత్తులు చేసి మంచి సినిమాలు తీయాలని సూచిస్తున్నారు.
Also Read : మహేష్ కోసం 'అరవింద...'లో బసిరెడ్డి కంటే భయంకరంగా - జగపతి బాబు