'శ్రీమంతుడు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు తండ్రిగా సీనియర్ కథానాయకుడు జగపతి బాబు నటించారు. కన్న కుమారుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే తండ్రిగా, సొంతూరు అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కుమారుడి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు, బిడ్డను కాపాడుకోవడానికి కోసం తాపత్రయపడే తండ్రిగా జగపతి బాబు అభినయం ప్రేక్షకుల్ని ఎంత గానో ఆకట్టుకుంది.
'శ్రీమంతుడు' తర్వాత 'మహర్షి'లోనూ జగపతి బాబు (Jagapathi Babu) నటించారు. అయితే, ఆ సినిమాలో ఆయనది విలన్ క్యారెక్టర్. కార్పొరేట్ క్రిమినల్ రోల్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కిస్తున్న తాజా సినిమా (SSMB 28)లో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. తన క్యారెక్టర్ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ!
బసిరెడ్డి కంటే భయంకరంగా...
మహేష్ బాబుతో మాత్రమే కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ జగపతి బాబుది సూపర్ హిట్ కాంబినేషన్! 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో ప్రతినాయకుడు బసిరెడ్డి పాత్రలో నటించారు.
పగ ప్రతీకారం కోసం కన్న కుమారుడి ప్రాణాలు తీసిన బసిరెడ్డి పాత్రలో జగపతి బాబు భయంకరమైన విలనిజం చూపించారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం దాన్ని మించిన భయంకరమైన పాత్రను త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేశారని ఆయన చెప్పారు.
Jagapathi Babu Role In SSMB 28 : ''మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. 'అరవింద సమేత'లో త్రివిక్రమ్ నా కోసం అద్భుతమైన పాత్ర రాశారు. నా నుంచి అద్భుతమైన నటన రాబట్టుకున్నారు. ఈసారి మేం మరింత ఆసక్తికరంగా, ఇప్పటి వరకు ఎవరూ చేయనిది ఏదైనా చేయాలనుకున్నాం. మహేష్ సినిమాలో పాత్రను 'అరవింద సమేత...'లో చేసిన బసిరెడ్డి కంటే భయంకరమైన, వైల్డ్ గా చేశాం. అయినా సరే ప్రేక్షకులు ఆ పాత్రను ఇష్టపడతారు. అది మంచిగా కావచ్చు, చెడుగా అయినా కావచ్చు'' అని బాలీవుడ్ మీడియాతో జగపతి బాబు పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రభాస్ 'సలార్', అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ఆయన చేస్తున్నారు.
Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.
మే 31న టైటిల్ చెబుతారా?
మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రతి ఏడాది తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక కబురు చెప్పడం మహేష్ బాబుకు ఆనవాయితీగా వస్తోంది.
Also Read : 'వ్యవస్థ' రివ్యూ : దీన్ని కోర్టు రూమ్ డ్రామా అంటారా? ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?