వెబ్ సిరీస్ రివ్యూ : వ్యవస్థ
రేటింగ్ : 2/5
నటీనటులు : హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, కామ్నా జెఠ్మలానీ తదితరులు
కథ : రాజసింహ
మాటలు : రవి మల్లు
అడిషనల్ స్క్రీన్ ప్లే : శ్రవణ్
ఛాయాగ్రహణం : అనిల్ బండారి
సంగీతం : నరేష్ కుమరన్
క్రియేటర్ & డైరెక్టర్ : ఆనంద్ రంగా
నిర్మాత : పట్టాభి ఆర్. చిలుకూరి
విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
ఎపిసోడ్స్ : 8
ఓటీటీ వేదిక : జీ 5


కోర్టు రూమ్ డ్రామాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా అందుతాయని 'వకీల్ సాబ్', 'నాంది' చిత్రాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు ఓటీటీల్లోనూ కోర్ట్ రూమ్ డ్రామాలు వస్తున్నాయి. హెబ్బా పటేల్ (Hebah Patel), కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆనంద్ రంగా రూపొందించిన సిరీస్ 'వ్యవస్థ' (Vyavastha zee5 Web Series). జీ 5 ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.


కథ (Vyavastha Series Story) : శోభనం గదిలోకి పెళ్ళికొడుకు వెళ్లిన కాసేపటికి గన్ ఫైరింగ్ సౌండ్ వినపడుతుంది. పని మనుషులు వెళ్లే సరికి... యామిని (హెబ్బా పటేల్) చేతిలో గన్ ఉంటుంది. ఆమె ముందు రక్తపు మడుగులో కొత్త పెళ్ళికొడుకు. తన తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్ అవినాష్ చక్రవర్తి (సంపత్ రాజ్)ను యామిని నియమించుకుంటుంది. అయితే, మొదటి వాయిదాలో న్యాయవాదిని మార్చుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేస్తుంది. కోర్టులో తనకు ఎదురే ఉండకూడదని తోటి మేటి న్యాయవాదులను భాగస్వాములుగా చేసుకుని చెక్‌మేట్ పేరుతో ఫర్మ్ ప్రారంభిస్తాడు. అటువంటి చక్రవర్తి దగ్గర జూనియర్ లాయర్ అయిన వంశీకృష్ణ (కార్తీక్ రత్నం) చేతిలో యామిని తన కేసు పెడుతుంది. 


తనను కాదని యామిని వెళ్ళడంతో చక్రవర్తి ఏం చేశాడు? వంశీకృష్ణపై క్రిస్టియన్ మైనారిటీ సంఘాలు ఎందుకు విరుచుకు పడ్డాయి? యామిని కేసులో అతను కూడా ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది? సాక్ష్యాలు అన్నీ యామిని దోషి అంటుంటే...  చక్రవర్తి వంటి బలమైన న్యాయవాదితో ఢీకొని యామినిని ఈ కేసు నుంచి  వంశీకృష్ణ బయటకు తీసుకు రాగలిగాడా? లేదా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Vyavastha ZEE5 Review) : ఓటీటీలతో ప్రజలకు సౌలభ్యం ఏమిటంటే... నచ్చిన  సమయంలో, నచ్చిన చోటు నుంచి సిరీస్ గానీ, సినిమా గానీ చూడొచ్చు. మధ్యలో పని పడితే కాసేపు పాజ్ చేసుకుని మళ్ళీ చూడొచ్చు. 


పాజ్ బటన్ కాదు... పొరపాటున ఫార్వర్డ్ బటన్ నొక్కినా సరే సన్నివేశాల్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియదు. అదీ 'వ్యవస్థ' గొప్పతనం. సిరీస్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. కానీ, ఆ ఆసక్తి నీరు గారడానికి ఎంతో సేపు పట్టదు. ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ప్రతి ఎపిసోడ్ ఎండింగులో హుక్ పాయింట్, ట్విస్ట్ ఉంటుంది. అవే కాస్త ఇంట్రెస్టింగ్‌ టాపిక్స్!


కొన్ని కథలు పేపర్ మీద బావుంటాయ్! కానీ, స్క్రీన్ మీదకు వచ్చేసరికి అంత ఆసక్తి కలిగించవు. కథగా చూస్తే... 'వ్యవస్థ' బావుంటుంది! శోభనం రోజున భర్తను చంపేసిన మహిళ నిర్దోషిగా బయట పడుతుందా? జైలు శిక్ష అనుభవిస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్! కానీ, స్క్రీన్ మీద సీన్లు చూస్తే అంత ఉత్కంఠ, ఉత్సుకత కలిగించవు. అందుకు ప్రధాన కారణం కోర్టు రూములోని వాదనల్లో, దర్శకత్వంలో బలం లేకపోవడమే! న్యాయ 'వ్యవస్థ'లోనూ అమ్మాయిలను ఎర వేయడం, దౌర్జన్యం వంటి రెగ్యులర్ రొటీన్ అంశాలపై దర్శక, రచయితలు ఆధార పడ్డారు. న్యూస్ పేపర్స్ తిరగేస్తే కొత్త కేసులు కనపడతాయి. వాటిని వదిలేసి రెగ్యులర్ ఆస్తి గొడవలు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్, దళితులను అవమానించడం వంటి రొటీన్ కేసులే  తీసుకున్నారు. వాటికీ సరైన న్యాయం చేయలేదు.  


డబ్బు కోసమే చక్రవర్తి కేసులు కేసులు టేకప్ చేస్తున్నాడని, అతనిలో నిజాయతీ లేదని ఫీలయ్యే హీరో, ఏ నిజాయతీ చూసి హీరోయిన్ కేసు టేకప్ చేశాడు? ఒక వైపు భర్తను కాల్చింది తానేనని కథానాయిక చెబుతుంది. అటువంటి ఆమెను ఎప్పుడో చూసి ప్రేమించానని సాయం చేయడం ఏమిటి? ప్రేమిస్తే దోషిని బయటకు తెస్తారా? బేసిక్ పాయింట్ దగ్గరే బలం లేదు. క్యారెక్టరైజేషన్ కాన్‌ఫ్లిక్ట్ మిస్సింగ్ అక్కడ!లాజిక్కులు విషయానికి వెళితే బోలెడు ఉన్నాయి. డోర్ బద్దలుకొట్టుకుని పని మనుషులు లోపలి వెళ్ళారా? లేదంటే తలుపులు తీసుకుని వెళ్ళారా? అనేది తీసేటప్పుడు సరిగా చెక్ చేసుకోకుండా తీశారు.


ఇన్వెస్టిగేషన్ డ్రామా, కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలి? పిన్ టు పిన్... ప్రతిదీ పక్కాగా, లాజిక్కులతో ఉండాలి. స్క్రీన్ మీద సీరియస్‌నెస్ కనిపించాలి. ఏదో ముందుకు వెళుతుందంటే... వెళుతుందన్నట్టు ఉంటుంది తప్ప 'వ్యవస్థ'లో సరైన రైటింగ్ కనిపించదు. ఓ సోల్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అసలు, కోర్టులో జరిగే డ్రామా తక్కువ. బయట కథలు ఎక్కువ. 'వ్యవస్థ'లో చాలా లేయర్స్ ఉన్నాయి గానీ, ఏదీ కొత్తగా & ఆసక్తిగా అనిపించదు.  


నటీనటులు ఎలా చేశారు? : ఆర్టిస్టుల్లో మిస్ ఫిట్ అంటే ముందుగా హెబ్బా పటేల్ పేరు గుర్తుకు వస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్‌లో ఉన్న డెప్త్... ఆమె యాక్టింగులో లేదు. యామిని సన్నివేశాలు చూస్తే వీక్షకుల్లో జాలి కలగాలి. కానీ, ఏ దశలోనూ అలా జరగలేదు. నటిగా ఫెయిల్ కావడం ఒకటి అయితే... కథానాయికగా ఆమెకున్న ఇమేజ్ మైనస్ అయ్యింది.


విలన్ రోల్స్ చేయడం సంపత్ రాజ్ (Sampath Raj)కు కొత్త ఏమీ కాదు. ఎప్పటిలా తనకు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్లారు. కార్తీక్ రత్నం నటన బావుంది. కానీ, నత్తిని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. పోనీ, టెన్షన్ పడినప్పుడు మాత్రమే నత్తి వస్తుందనేది ఎస్టాబ్లిష్ చేశారా? అంటే అదీ లేదు. 'వ్యవస్థ'తో కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఇచ్చారు. గౌతమి పాత్రలో చాలా చక్కగా నటించారు. కామ్నా అందం వల్ల క్యారెక్టర్ ట్విస్ట్  వర్కవుట్ అయ్యింది. తేజ కాకుమాను ఓ పాత్రలో కనిపించారు.   


Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?


చివరగా చెప్పేది ఏంటంటే? : ప్రేక్షకుల్లో ఏం తీసినా చూసేస్తారని నిర్మాతలు, దర్శక - రచయితలు అనుకుంటే పొరపాటే. సోషియో ఫాంటసీ, ప్రేమకథలో ఏం తీసినా చెల్లుతుంది. కోర్ట్ రూమ్ డ్రామాలు తీసేటప్పుడు ప్రతిదీ పక్కాగా ఉండాలి. లేదంటే రిస్కే. 'వ్యవస్థ'లోని కోర్టు రూమ్ వాదనల్లో బలం లేదు. కథలో డ్రామా అసలే లేదు. ఈజీగా స్కిప్ చేయవచ్చు. రిస్క్ చేస్తామంటారా? ఫార్వర్డ్ బటన్ ఎలాగో ఉందిగా!


Also Read : పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఎలా ఉంది?