ప్రభాస్ హీరోగా నటిస్తున్న'ఆదిపురుష్' చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా కోసం యావత్ నీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా కథ అందరికీ తెలిసిందే అయినా ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి తగ్గట్టు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనే ఈ కొత్త ఫార్మేట్ ఎలా ఉంటుందో చూడాలని అటు ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'ఆదిపురుష్' సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక సీటును కేటాయిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. దీంతో ఆ సీటు పక్కనే తమకు సీటు దక్కేలా టికెట్స్ కొనాలని చాలామంది సినీ ఆడియన్స్ తెగ ఆరాట పడుతున్నారు.


ఈ క్రమంలోనే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరూ తమకు ఆ ఖాళీ సీటు పక్కనే కూర్చునే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇరువైపుల సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆ సీటు దక్కుతుంది అన్నట్లుగా ఓ వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా ఆదిపురుష్ మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీం పేర్కొంటూ.. " ఆదిపురుష్' టికెట్ ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త ప్రచారం అవుతుంది. హనుమంతుడికి రిజర్వ్ చేసిన సీటు పక్కన సీట్లకు ఎక్కువ ధరలు కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలని ఎవరు నమ్మకండి. జైశ్రీరామ్" అంటూ ఆదిపురుష్ సినిమాను నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చింది. కాగా రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తుండగా, కృతి సనన్ సీతగా నటిస్తోంది.


అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మించారు. మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి నార్త్ ఇండియాలో ఈ రోజే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కేవలం 24 గంటల్లోనే నార్త్ లో ఆదిపురుష్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 24 గంటల్లోనే సుమారు రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. డార్లింగ్ ఫాన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



Read Also: బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పని జూనియర్ ఎన్టీఆర్? ఫ్యాన్స్ హర్ట్!