Ram Lakshman: సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్-లక్ష్మణ్. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీ గా ఉండే రామ్-లక్ష్మణ్ లు కాస్త విరామం దొరికినా సొంత ఊరికి వెళుతూ ఉంటారు. సొంతూరుకు వెళ్లిన ప్రతీసారి ఊరికి ఏదొక మంచి చేయాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈసారి కూడా తమ సొంతూరుకు వెళ్లారు. అయితే ఈసారి ఓ మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. మనుషుల్లో రోజు రోజుకూ తగ్గిపోతున్న మానవత్వ విలువల్ని తట్టిలేపేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఏం చేశారో మీరే చూడండి..
వృద్ధాశ్రమం కోసం బిక్షాటన..
సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా వీలు కుదిరినప్పుడల్లా సొంతూరుకు వెళ్తూ ఉంటారు రామ్-లక్ష్మణ్. వెళ్లిన ప్రతీసారి చీరాల ప్రాంతంలో ఉన్న కోటయ్య వృద్ధాశ్రమాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు సందర్శిస్తుంటారు. అలాగే తమకు సాధ్యమైనంత మేర సాయం చేస్తుంటారు. అయితే ఈసారి ఆశ్రమాన్ని సందర్శించిన అన్నదమ్ములు ఆశ్రమానికి సాయం చేయడానికి వినూత్నంగా ఆలోచించారు. వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం ఉంది. అందుకు సాయం చేయడం కోసం రోడ్ల మీద బిక్షాటన చేశారు. ఆ వచ్చిన డబ్బుతో కొంత సొమ్మును కలిపి ఆశ్రమానికి అందించారు.
సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే..
ఆశ్రమానికి సాయం చేయడానికి రామ్ లక్ష్మణ్ లు స్వయంగా బిక్షాటన చేసి నగదును సమకూర్చారు. అయితే ఇలా ఎందుకు చేయడం మీరు సినిమా వాళ్లు కదా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే సాయం చేయొచ్చు కదా అని అడిగితే.. తమ వద్ద ఉన్న డబ్బుతో సాయం చేయొచ్చు కానీ ఆశ్రమానికి ఆటో అవసరం ఉంది అనే విషయం ప్రజలకు తెలియాలని, ఇలాంటి పనిలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనే ఇలా చేశామని అన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని మనకు చేతనైన సాయం చేయాలని అన్నారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూక్తిని అందరూ పాటించాలని అప్పుడు అందరూ బాగుంటారని చెప్పారు. అనంతరం రామ్ లక్ష్మణ్ లు కోటయ్య వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ వున్న వృద్ధులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మంది వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు కోటయ్య సతీమణి ప్రకాశమ్మను అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్-లక్ష్మణ్ లు చేసిన మంచి పనిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్లుగా..
రామ్-లక్ష్మణ్ లు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1993 లో ఓ మలయాళ సినిమాతో కెరీర్ నుం ప్రారంభించారు. తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు. అంతే కాదు పలు సినిమాల్లోనూ హీరోలుగా నటించారు. తెలుగులో దాదాపు అందరి పెద్ద హీరోల సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఫైట్ మాస్టర్స్ గా చేస్తూ దూసుకుపోతున్నారు . అటు సినిమాలతో పాటే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ గుర్తింపు పొందతున్నారు రామ్-లక్ష్మణ్.
Read Also: గొడ్డలితో ఆ నరుకుడేంది రణబీర్? రక్తంతో నిండిపోయిన 'యానిమల్' ప్రీ టీజర్!