Adipurush box office collection Day 12: ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్(Adipurush)' విడుదలైన రోజు నుంచి వివాదాలే వెంటాడుతున్నాయి. ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. విడుదలైన నాలుగో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 12వ రోజైతే కలెక్షన్లు దాదాపు అడుగంటాయి. వసూళ్లలో భారీ తగ్గుదల కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఆదిపురుష్' థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకుందని పలువురు అంటున్నారు.
పలు నివేదికల ప్రకారం 'ఆదిపురుష్' పన్నెండో రోజున అంటే జూన్ 27న మంగళవారం రూ.1.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు దేశీయంగా రూ.279.78 కోట్లను రాబట్టినప్పటికీ.. ఆ మూవీకి పెట్టిన బడ్జెట్, రాబడి అంచనాలతో పోల్చి చూస్తే చాలా తక్కువే. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్.. హిందీ ఆక్యుపెన్సీ మంగళవారం నాటికి 7.23 శాతమే నమోదైంది. అతి పెద్ద మార్కెట్ గా భావిస్తోన్న బాలీవుడ్(Bollywood)లో ఈ సినిమా రూ.150 కోట్ల మార్కును చేరుకోవడం కూడా చాలా కష్టంగా కనిపిస్తోంది.
కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీల 'సత్యప్రేమ్ కీ కహానీ (Satya Prem ki Kahani)' సినిమా ఈ శుక్రవారం విడుదల కానుండడంతో ఆదిపురుష్ కలెక్షన్లు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని డైలాగులు, సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఈ క్రమంలో సినిమాను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేశారు. వాల్మికీ రామాయణం తీసామని చెప్పి.. తనదైన పైత్యంతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి ఈ సినిమా తీశారంటూ హిందూ సంఘాలు.. ఓం రౌత్ తీరుపై మండిపడ్డారు.
రామాయణాన్ని అపహాస్యం చేసేలా 'ఆదిపురుష్' ను చిత్రీకరించారని నెటిజన్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మూవీలోని డైలాగులు మారుస్తామని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. కొన్ని చోట్ల 'ఆదిపురుష్' స్క్రీనింగ్ ధరలు కూడా తగ్గించేశారు. ఎలాగైనా ప్రేక్షకులు 'ఆదిపురుష్' ను చూడాలని మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇప్పటికే స్ప్రెడ్ అయిన నెగెటివిటీ కారణంగా సినీ ప్రేక్షకులు మూవీ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు.
హైకోర్టు సీరియస్
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఆదిపురుష్ సినిమా విపరీతమైన విమర్శల మధ్య ప్రదర్శితమవుతోంది. ఇటీవలే ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు తీరుపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. సెన్సార్ కాపీ చూసిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ ఎలా సమర్ధించారని ప్రశ్నించింది. భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ విచారణకు ఆదిపురుష్ దర్శకనిర్మాతలు హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
త్వరలోనే ఓటీటీలోకి..
తాజాగా 'ఆదిపురుష్' సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై దర్శకనిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Also : హీరో సూర్య ఆ డైలాగ్ తీయించేశాడు, అది పెద్ద మిస్టేక్: ఉదయనిధి స్టాలిన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial