రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను సెలబ్రిటీలందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం కాబట్టి అందరినీ ఆయన అలా పిలుస్తారు. కానీ ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తాజాగా మరోసారి ప్రూవ్ అయింది. ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ తల్లి ప్రభాస్ తన కొడుకుగా పుట్టాలంటూ కోరుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


'దేవర'లోనే కాదు... 'ది రాజా సాబ్'లోనూ తల్లిగా!
'దేవర' మూవీలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించింది బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వాహబ్. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ కు తల్లిగా జరీనా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హిందీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చెబుతూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. జరీనా ప్రభాస్ గురించి మాట్లాడుతూ "ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీలోనూ నేను చూడలేదు. క్రాఫ్ట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన సెట్లో సమానంగా చూస్తారు. నాకు ఆకలేస్తుంది అని తెలిస్తే వెంటనే ఇంటికి ఫోన్ చేసి 40 నుంచి 50 మందికి ఫుడ్ తెప్పిస్తారు. వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకుకి తల్లి కావాలని కోరుకుంటాను. అయితే ఇద్దరు కొడుకులు కావాలి... అందులో ఒకరు ప్రభాస్ ఐతే, మరొకరు నా కొడుకు సూరజ్" అంటూ జరీనా వాహబ్ చేసిన కామెంట్స్ నెట్టింట  చక్కర్లు కొడుతున్నాయి. 






జరీనా వాహబ్ బాలీవుడ్ యాక్టర్. కానీ నిజానికి ఆమె తెలుగు ఇంటి అమ్మాయే. విశాఖపట్నంలో పుట్టి, పెరిగిన జరీనా... ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్, ప్లే బ్యాక్ సింగర్ ఆదిత్య పాంచోలిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళ, మలయాళ భాషలతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. తెలుగులో ఆమె అమర ప్రేమ, హేమా హేమీలు, రక్త చరిత్ర 2, గాజుల కిష్టయ్య, విరాటపర్వం, దేవర వంటి సినిమాల్లో నటించింది.



జరీనా వాహబ్ కొడుకు బాలీవుడ్ లో హీరోగా నటిస్తున్నారు. అతని పేరు సూరజ్ పాంచోలి. అయితే ఇప్పటిదాకా ప్రభాస్ పై చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇలా ఒక సీనియర్ నటి ఏకంగా ప్రభాస్ వచ్చే జన్మలో కొడుకు పుట్టాలని కోరుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చూసి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ మనస్తత్వానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మొత్తానికి మన బాహుబలికి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ అభిమానులే. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ది రాజా సాబ్" సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. మారుతీ ఈ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. 


Read Also : Rashmika Mandanna: ఆ రోజు నా జీవితంలో చాలా స్పెషల్... రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్