Actress Anasuya About Razakar Movie: తెలంగాణలో రజకార్ల దాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘రజాకార్’. యాటా సత్యానారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మన చరిత్రను చెప్పేదే ‘రజాకార్’- అనసూయ
ఇక ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘రంగస్థలం‘లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప‘, ‘విమానం‘, ‘ప్రేమ విమానం‘, ‘రంగమార్తాండ’ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి అలరించింది. తాజాగా ‘రజాకార్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ, ‘రజాకార్’ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటించి ఉండకపోతే, తన చరిత్రను తెలుసుకునే అవకాశం కలిగేది కాదన్నారు. “’రజాకార్’ సినిమా తెలంగాణ చరిత్ర గురించి, మన మూలాల గురించి చెప్తుంది. మన అస్తిత్వాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాల ద్వారా మన గతం ఏంటనేది తెలుస్తుంది. నేను చెప్పే విషయాలు కొన్నిసార్లు వివాదం అవుతుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో ఎలాంటి వివాదం అయిన ఫర్వాలేదు. ఈ సినిమా వివాదం నాకు ఇష్టమైన వివాదం” అంటూ అనసూయ వివరించారు.
నా పాత్ర ఇంకా ఉంటే బాగుండేది అనుకుంటారు- అనసూయ
ఇక ‘రజాకార్’ సినిమాలో తన రోల్ గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఈ సినిమా గురించి డైరెక్టర్ చెప్పినపుడు ఇంత చిన్న రోల్ ఎందుకు ఇస్తున్నారని అడిగాను. కానీ, సినిమాలో చేశాక ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో అర్థం అయ్యింది. ఈ సినిమాలో నా పాత్ర చూసాక సినిమాలో అనసూయ కాసేపు కనిపిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు భావిస్తారు. నేను అనుకున్నట్లు జరిగితే నటిగా సక్సెస్ అయినట్టేనని భావిస్తాను” అని అనసూయ వెల్లడించింది.
ఆకట్టుకున్న అనసూయ బతుకమ్మ పాట
ఇప్పటికే ‘రజాకార్’ సినిమాలోని బతుకమ్మ పాటను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు సృష్టించిన మారణహోమాన్ని గుర్తు చేస్తూ.. ‘భారతి భారతి ఉయ్యాలో’ అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఇందులో అనసూయ బతుకమ్మ ఆడుతూ కనిపించింది. నిజాం పాలకుల మీద ఉన్న కోపాన్ని వెల్లగక్కుతూ ఈ పాట పాడుతుంది. ‘భారతి భారతి ఉయ్యాల’.. అనే ఈ పాట కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. మోహన భోగరాజు, భీమ్స్ సీసిరోలియో, స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. భీమ్స్ సంగీతం అందించాడు. ఈ వీడియో చూస్తుంటే.. అనసూయ మరోసారి పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: పేరు మార్చండి, లేదంటే సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేయండి - చిక్కుల్లో మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’