Raajadhani Files Director Bhanu About movie: ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. వ్యూహ.. ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. దాంట్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనాల్ని ఆకట్టుకునేందుకు, ఓటర్లను.. తమవైపు తిప్పుకునేందుకు సినిమాలను ఉపయోగించుకుంటున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుండగా.. రాజధాని రైతులు పడుతున్న కష్టాలను చూపిస్తూ.. ‘రాజధాని ఫైల్స్’ టైటిల్‌తో ఓ మూవీ వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 15న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఆసక్తికర విషయాలు పంచుకుంది.
రాజకీయ హంగులు లేవు..
రాజధాని అంశంలో ఏపిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూపిస్తూ తెరకెక్కించిన సినిమానే ‘రాజధాని ఫైల్స్’. మూవీ విడుదల నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ డైరెక్టర్ భాను విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. మూడు రాజధానులు ఉంటే మీ కేంటి అని ప్రశ్నించాడు. ఇందుకు ఆయన బదులిస్తూ.. ‘‘ మూడు రాజధానులు ఉంటే ఏమువుతుంది? ఒక రాజధాని ఉంటే ఏమవుతుందో? సినిమాలో చూపించాను. ముగ్గురు అమ్మలు ఉంటే ఏంటి? ముగ్గురు నాన్నలు ఉంటే ఏంటి? అనేది చూపించాను. ఏ రైతు భూమి ఇచ్చాడో వాళ్ల గురించి చూపిస్తున్నాను. వాళ్లకు జరిగిన నష్టాన్ని చూసి సినిమా తీశాను. ఫిక్షనల్ గా కథ చెప్పాలి కాబట్టి రాష్ట్రం పేరు, ప్రాంతం పేరు మార్చుకున్నాను. పొలిటీషియన్స్ ఎవరు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, తిట్టుకోవచ్చు. కానీ, సినిమా వాళ్లకు అలాకాదు.. అందుకే, ఫిక్షనల్ గా చెప్పాను. చాలా సినిమాలు సమస్యను చెప్తాయి. సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పాను. ప్రధాని మోడీ కూడా అపీల్ చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది కూడా ఈ సినిమాలో చెప్పాను. నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందో అని ఆలోచించి సొల్యూషన్ రాసుకున్నాను. ఇక రాజధాని రైతులను ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎవ్వరూ ఓదార్చలేదు. ఎవ్వరూ ఓదార్చలేదు కాబట్టే ఇప్పటికీ పోరాడుతున్నారు. అందుకే, బాధపెట్టిన వాళ్లు, బాధపడిన వాళ్ల గురించి చెప్పాం. రాజకీయంగా సినిమా టచ్ చేయలేదు. సినిమా అంటే వ్యాపారమే కాదు.. సామాజిక బాధ్యత కూడా. సామాజిక బాధ్యతతోనే డైరెక్షన్ చేశాను. పొలిటికల్ హంగులు పెట్టలేదు ఈ సినిమాకి ’’ అని చెప్పారు డైరెక్టర్ భాను.
ఏపీలో గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దానికి సంబంధించి భూ సేకరణ కూడా చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రపోజల్ తెచ్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. ఆందోళన చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలు చేశారు. నిరసనలు చేశారు. ఈ పరిస్థితులను చూపిస్తూ తీసిందే ‘రాజధాని ఫైల్స్’. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట లుక్, ట్రైలర్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ట్రైలర్ లోని ఒక్కో డైలాగ్ పవర్ ఫుల్ గా ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘రాజధాని ఫైల్స్’.
Also Read: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆరే గొప్ప అంటూ స్టేట్‌మెంట్