Jayaprada News: ప్రముఖ నటి జయప్రదకు కోర్టు ఝలక్‌ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ ప్రజాప్రతినిధుల కోర్టు జయప్రదను అరెస్ట్‌ చేయాలంటూ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా ఈ కేసుపై విచారణలు సాగుతుండగా, తాజాగా ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదు చేశారు. వాటి విచారణకు ఆమె ఇప్పటి వరకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజాప్రతినిధులు కోర్టు ఆమెను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు ఈ నెల 27న హాజరుపర్చాలంటూ ఆదేశించింది.


రెండు చోట్ల ఫిర్యాదుతో కేసు నమోదు


2019 ఎన్నికల్లో జయప్రద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి రాంపూర్‌ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన జయప్రద.. జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తునే అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు పెట్టడంతోపాటు అనుచరులతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార సమయంలో ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్‌ పోలీస్‌ స్టేషన్లలో పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులు ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణలో భాగంగా కోర్టుకు హాజరుకావాలంటూ పలుమార్లు ననోటీసులు జారీ చేసినప్పటికీ జయప్రద స్పందించలేదు. దీనిపై ప్రజాప్రతినిదులు కోర్టు కాస్త అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే, ఇప్పటి వరకు ఏడుసార్లు వారెంట్‌ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్‌ చేయలేదంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసును తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 


2004లో లోక్‌సభకు ఎన్నిక


జయప్రద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1994లో ఎన్‌టీఆర్‌ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. 1996లో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవలతో తెలుగుదేశానికి రాజీనామా చేసిన జయప్రద.. ములాయం సింగ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆంధ్ర నా జన్మభూమి.. ఉత్తర ప్రదేశ్‌ నా కర్మ భూమి అన్న నినాదంతో రాంపూర్‌ నియోజకవర్గం నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరిన ఆమె.. గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, జయప్రదవకు ఈ తరహా వివాదాల్లో చిక్కుకోవడం తొలిసారి. చెన్నై కోర్టు కూడా గతంలో ఒకసారి జయప్రదను దోషిగా నిర్ధారిస్తూ ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా వేసింది. చెన్నైలోని సొంత థియేటర్‌ కార్మికులకు ఈఎస్‌ఐ సొమ్ము చెల్లించలేదనే ఆరోపనలను జయప్రద ఎదుర్కొన్నారు. ఈ కేసులో సిబ్బంది బకాయిలు చెల్లిస్తానని, కేసు కొట్టివేయాలని ఆమె కోరరారు. కోర్టు ఆమె చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చుతూ ఆరు నెలలు జైలు, జరిమానా విధించింది.