Mammootty’s Bramayugam In Legal Trouble: మలయాళీ స్టార్ హీరో ముమ్మట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘కాథల్ ది కోర్’ మూవీ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదే జోష్ లో ‘భ్రమయుగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఫిబ్రవరి 15న థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతోంది.
‘భ్రమయుగం’పై భారీ అంచనాలు
విభిన్న కథాంశాలతో సినిమాలు చేయడంలో మమ్ముట్టి ముందుంటారు. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు. ‘భ్రమయుగం’ చిత్రం సైతం సరికొత్త కథాంశంతో రూపొందింది. హారర్, థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథ కేరళలో మాయ, తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా ముందుకు సాగుతుంది. ‘భ్రమయుగం’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ సరికొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను ఓ రేంజికి తీసుకెళ్లింది. థియేటర్లలో ప్రేక్షకులను సీటు ఎడ్జ్ లో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
చిక్కుల్లో మమ్ముట్టి మూవీ
ఓవైపు సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, మరోవైపు ఈ సినిమాపై కేరళ హైకోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఈ సినిమాలోని మమ్ముట్టి పాత్ర 'కుంజుమోన్ పొట్టి'ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయ్యింది. కేరళలోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుంజమోన్ ఇల్లం ఈ పిటిషన్ వేశారు. ఈ కేసును జస్టిస్ దేవన్ రామచంద్రన్ విచారించారు. ఈ సినిమా తమ వంశం, చరిత్రకు సంబంధించిన ‘ఐతిహైమల‘ పుస్తకాన్ని బేస్ చేసుకుని తీసినట్లు ఉందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
మమ్ముట్టి పాత్ర తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని తెలిపారు. ప్రధాన పాత్ర పేరు, ఇంటి పేరు మార్చకపోతే తమకు నష్టం కలిగించే అవకాశం ఉందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సినిమాలో 'కుంజుమోన్ పొట్టి' అనే పాత్రను ప్రతికూల అర్థం వచ్చేలా రూపొందించారని, వెంటనే సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ను రద్దు చేయాలని కోరారు. లేదంటే, పాత్ర పేరు మార్చాలని కోరారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. అన్ని పార్టీలకు నోటీసు జారీ చేయబడింది.
ఇక ‘భ్రమయుగం’ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ముందుగా మలయాళం భాషలో మాత్రమే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో విడుదలైన తర్వాత.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మరో తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Read Also: చనిపోయిన కెప్టెన్‌కు ప్రాణం పోయనున్న దళపతి విజయ్ - ఆ మూవీలో అతిథి పాత్ర