Valentine's Day 2024: 'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో గొప్ప ప్రేమ కథలను మనం వింటూ వచ్చాం. నిజమైన ప్రేమకు నిదర్శనంగా వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబడిన ఎన్నో ప్రేమకథా చిత్రాలను చూస్తూ ఉన్నాం. అప్పటి 'దేవదాసు' నుంచి ఇప్పటి 'సీతా రామం' వరకూ ఎన్నో కల్ట్ లవ్ స్టోరీలు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.


భగ్న ప్రేమికుడు 'దేవదాసు'...
ప్రేమ కథా చిత్రాలు అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ‘దేవదాసు’(1953). భారతీయ సినిమా చరిత్రలో ఎన్ని ప్రేమకథలు వచ్చినా, ఈ సినిమాకు ఉండే ప్రత్యేకతే వేరు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాద్యాయ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి భగ్న ప్రేమికులుగా సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. ఈ సినిమా కంటే ముందు, ఆ తర్వాత అన్ని భాషల్లో కలిపి మొత్తం 12 సార్లు దేవదాసు కథను తెర మీదకు తీసుకొచ్చినా.. తెలుగు దేవదాసు మాత్రమే ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ గా నిలిచిపోయింది.


70 - 80 దశకంలో ప్రేమ కథలు...
'దేవదాసు' తర్వాత ఆ రేంజ్‌లో ప్రేమికులను అలరించిన ప్రేమ కథా చిత్రం ‘ప్రేమ నగర్’. దీంట్లో నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించారు. ఆ తర్వాత ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధ కలిసి నటించిన 'ప్రేమాభిషేకం' సినిమా లవ్ స్టోరీల్లో నూతన ఒరవడి సృష్టించింది. ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ‘ఆరాధన’ సినిమా కూడా మంచి స్థానం సంపాదించుకుంది. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మరో చరిత్ర’ చిత్రం నిజంగానే మరో చరిత్ర సృష్టించింది. భారతీ రాజా దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకోక చిలుక’ సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. 'ప్రేమ సాగరం', 'అభినందన' లాంటి సినిమాలు కూడా విశేషంగా అలరించాయి. 


నాగ్ 'మజ్ను'.. చిరు 'ఆరాధన'.. వెంకీ 'ప్రేమ'...
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, రజినీ జంటగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమా ట్రాజెడీ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. చిరంజీవి, సుహాసిని, రాధిక ప్రధాన పాత్రల్లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'ఆరాధన' చిత్రం సైతం ఆదరణ దక్కించుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేశ్, రేవతి కలిసి నటించిన ‘ప్రేమ’ మూవీ కూడా కల్ట్ లవ్ స్టోరీ అనిపించుకుంది.


Also Read: 'గుంటూరు కారం' తర్వాత అమ్మడికి కొత్త ఆఫర్స్ రావడం లేదా? కారణం అదేనా?


అందమైన ప్రేమ కావ్యం 'గీతాంజలి'..
నాగార్జున - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గీతాంజలి'. ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఇద్దరు పేషెంట్స్ మధ్య పవిత్రమైన ప్రేమకు నిదర్శనం ఈ చిత్రం. ప్రేమ కథా చిత్రాల్లో ఎవర్ గ్రీన్ గా, కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడిన హీరోహీరోయిన్లు, చివరి రోజుల్లో ఒకరికొరు తారసపడి ప్రేమలో పడతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోతారు. ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు కానీ, ప్రేమలో ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారనే లైన్ తో ఒక అందమైన కావ్యంలా ఈ సినిమాని తీర్చిదిద్దారు.


ముక్కోణపు 'ప్రేమ' దేశం...
90స్ లో యూత్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో 'ప్రేమ దేశం' ఒకటి. కాథిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో టబు, వినీత్, అబ్బాస్ ప్రధాన పాత్రలు పోషించారు. అదే కాథిర్ రూపొందించిన మరో కల్ట్ లవ్ స్టోరీ ' ప్రేమికుల రోజు'. కునాల్, సోనాలి బింద్రే జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ కథా చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన 'ప్రేమ లేఖ' మూవీ కూడా ట్రెండ్ క్రియేట్ చేసింది. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన 'తొలి ప్రేమ' సినిమా కల్ట్ స్టేటస్ అందుకుంది.


నువ్వు నేను.. ప్రేమిస్తే...
ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను’. ప్రేమకు కులం జాతి ఆస్తులు అంతస్తులు లేవని చాటిచెప్పిన ఈ సినిమా.. ఎవర్ గ్రీన్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది. అలానే సెల్వరాఘన్ తెరకెక్కించిన ‘7/G బృందావన కాలనీ’ సినిమా కూడా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చనిపోయిన ప్రియురాలి జ్ఞాపకాల్లో జీవితం గడిపే ప్రేమకుడి కథ ఇది. ఇక శంకర్ నిర్మాణంలో వచ్చిన విషాదాంత ప్రేమకథా చిత్రం 'ప్రేమిస్తే' కూడా కల్ట్ సినిమా అనిపించుకుంది.


ఏమాయ చేశావే.. సీతా రామం...
ఈతరం యువతీ యువకుల భావాలకు అద్దంపట్టేలా తెరకెక్కించిన యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలలో 'ఏమాయ చేశావే' ప్రత్యేకంగా నిలుస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించారు. శర్వానంద్, నిత్యామీనన్ కలిసి నటించిన ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు’ కూడా ప్రేమ కథా చిత్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతా రామం' సినిమా కల్ట్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది.


Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతున్న 4 కల్ట్ లవ్ స్టోరీలు!