Emraan Hashmi Comments: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటిలో ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్న  ‘ఓజీ’. సినిమా ప్రకటన నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ ఈ సినిమా వార్తల్లో ఉంటూనే వస్తుంది. చాలా కాలం తర్వాత పవన్‌ కళ్యాన్‌ ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు మూవీ బ్యాక్‍డ్రాప్, నటీనటుల ఎంపిక సహా చాలా విషయాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. పవన్ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా ఉండనుందని తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్ 3'లో విలన్‌గా నటించిన మెప్పించిన ఇమ్రాన్‌ ఇప్పుడు ఓజీలో నటిస్తుండటంతో మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓజీ మూవీ షూటింగ్‌ విశేషాలను పంచుకున్నాడు. ఈ మేరకు ఇమ్రాన్‌ హష్మీ మాట్లాడుతూ.. ఓజీ మూవీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా సౌత్‌ ఫిలిం మేకర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక-నిర్మాతలు చాలా ముందున్నారని, వాళ్లు చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్‌ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయంటూ దక్షిణాది మూవీ మేకర్స్‌పై ఇమ్రాన్‌ ప్రశంసలు కురిపించాడు.


Also Read: గుడ్‌న్యూస్‌ చెప్పిన మెగా కోడలు - క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేసిన ఉపాసన!


ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. "బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కంటే సౌత్ ఫిల్మ్ మేకర్స్ చాలా క్రమశిక్షణతో ఉంటారు. సినిమా కోసం వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. హిందీ సినిమాల్లో అలా కాదు. సినిమా కంటే కూడా నటీనటులకే ఇతర వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా సినిమాకు పెట్టే డబ్బు చాలా వృధా అవుతుందనేది నా అభిప్రాయం. అలాగే, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌తో పాటు పాత్ బ్రేకింగ్ కథల విషయానికి వస్తే.. దక్షిణాది చిత్రనిర్మాతలు బాలీవుడ్ కంటే ముందున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇమ్రాన్‌ హష్మీ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయ్యాయి. కాగా ఇమ్రాన్ హష్మి ఎంట్రీతో ఓజీ సినిమాకు బాలీవుడ్‍లోనూ మంచి బజ్ ఉండనుంది.






అలాగే తమిళ నటుడు అర్జున్ దాస్‍తో పాటు సలార్‌ బ్యూటీ, తమిళ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి కూడా ఇందులో కనిపించనున్నారు. ఇక ప్రియాంక మోహన్  పవన్‌ సరసన హీరోయిన్‍గా నటిస్తుంది. కాగా, ఈ చిత్రం 1950 బ్యాక్‍డ్రాప్‍లో రూపొందనుందని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. రవి కే చంద్రన్.. సినిమాటోగ్రాఫర్ విధులు నిర్వహిస్తున్నాడు. రన్ రాజా రన్, సాహో తర్వాత సుజీత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.