Captain Vijaykanth’s Cameo Role In Dalapati Vijay’s The GOAT Movie: తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కెప్టెన్ విజయ్ కాంత్. నటుడిగానే కాకుండా రాజకీయ పార్టీని స్థాపించి తమిళ ప్రజలకు చేరువయ్యారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం విజయ్ కాంత్ కన్నుమూశారు.  ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, విజయ్ కాంత్ కు సరికొత్తగా నివాళి అర్పించబోతున్నారు. తన తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT)లో ఆయన చేత అతిథిపాత్ర చేయించబోతున్నారు. చనిపోయిన కెప్టెన్ తో కామియో రోల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, నిజం.


AI టెన్నాలజీ సాయంతో అద్భుత సృష్టి  


దళపతి విజయ్  ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT) మూవీలో విజయ్ కాంత్ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో AI సాయంతో కెప్టెన్ విజయ్ కాంత్ ను సృష్టించబోతున్నారట. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో, విజయ్ కాంత్ ను AI టెక్నాలజీ సాయంతో చూపించబోతున్నట్లు కెప్టెన్ కుటుంబ సభ్యులకు విజయ్ చెప్పారట. వారు కూడా సరే అని చెప్పడంతో ఈ పాత్రను ఓకే చేసినట్టు సమాచారం.  


దళపతి చిన్నప్పటి పాత్రలో కెప్టెన్


‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT) సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. విజయ్ యువకుడిగా ఉన్న పాత్రలో విజయ్ కాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ ను 18 ఏండ్ల యువకుడిగా చూపించేందుకు చిత్రబృందం  డీఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ వాడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే మేకర్స్ ఎక్కువ బడ్జెట్ వెచ్చించబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత విజయ్ కాంత్ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ దళపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు.    


శరవేగంగా కొనసాగుతున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ షూటింగ్


ఇక ఈ మధ్యే విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT)  ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగి బాబు సహా పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Read Also: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం