Netizens Fire On Singer Aditya Narayan: బాలీవుడ్ దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ తనయుడు, గాయకుడు, పలు టీవీ షోలకు హోస్టుగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ్‌పై సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది. ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో అభిమానుల పట్ల ఆయన దురుసుగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానిని మైకుతో కొట్టటంతో పాటు పలువురి సెల్ ఫోన్లను గుంజుకుని విసిరేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మ్యూజికల్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఆదిత్య
తాజాగా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాయిలో ఓ మ్యూజిక్ షో జరిగింది. ఈ ఈవెంట్ లో గాయకుడు ఆదిత్య పాల్గొన్నారు. స్టేజి మీద పాటలు పాడుతున్న సమయంలో, స్టేజి కింద ఉన్న ఓ అభిమాని అతడిని ఫోటోలు తీస్తూ చేతులు ఊపాడు. ఈ సమయంలో అతడి చేయి ఆదిత్య కాలుకు తగిలింది. దీంతో ఆదిత్య రెచ్చిపోయాడు. అభిమాని ఫోన్ గుంజుకునేందుకు ప్రయత్నించాడు. అతడు ఎంతకీ వదలకపోవడంతో మైక్ తో అతడి చేతిపైన కొట్టి గుంజుకున్నాడు. దాన్ని దూరంగా విసిరేశాడు. అతడిది ఒక్కడితే కాదు, ఆయనను ఫోటోలు తీస్తున్న మరికొందరి ఫోన్లను కూడా లాక్కుని దూరంగా విసిరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"సింగర్ ఆదిత్య నారాయణ్ బిలాయిలోని రుంగ్టా కాన్సర్ట్ లో ఇలా ఓ అభిమానిని కొట్టి మొబైల్ విసిరేశాడు. అతడు ఎందుకిలా చేశాడన్నది తెలియడం లేదు" అని ఓ నెటిజన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారవడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఆదిత్యపై అభిమానుల ఆగ్రహం
నిజానికి ఆదిత్య నారాయణ్ తండ్రి ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ లెజండరీ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆయన ఏనాడు, ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు. అందరితో చాలా ఆప్యాయతగా ఉండేవారు. కానీ, ఆదిత్య వ్యవహార శైలి తండ్రితో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా వ్యవహారంపై నెటిజన్లు ఆదిత్యను ఎండగడుతున్నారు. “అభిమానులే లేకపోతే మీ ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారు?” అంటూ ఓ అభిమాని ఆదిత్యను నిలదీశాడు. “ఇలాంటి వ్యవహారాలతో కెరీర్ ను చేతులారా నాశనం చేసుకోవద్దు” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. “ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే, దానికి కారణం మీ నాన్న ఉదిత్ నారాయణ్. ఆయనే లేకపోతే, నీ స్థాయి ఏంటో గుర్తుంచుకుంటే మంచిది” అని మరొకరు కామెంట్ చేశారు.
అటు ఈ వివాదంపై ఆదిత్య నారాయణ్ ఎలాంటి కామెంట్ చేయలేదు. చత్తీస్‌గఢ్ లో తన షో అయిపోగానే, ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మీడియా అతడి కోసం వెయిట్ చేసినా, మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఆదిత్య రీసెంట్ గా ‘గదర్ 2’ మూవీలో ‘మై నిఖలా’ పాటను తన తండ్రి ఉదిత్ తో కలిసి పాడాడు. ఇండియన్ ఐడల్, సరిగమప షోల హోస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Also: ఆ పోర్న్ స్టార్‌తో రణవీర్ సింగ్ యాడ్ - ఇది పెద్దలకు మాత్రమే!