Vijay Deverakonda: విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు అంటే అతిశయోక్తి కాదు ఏమో!? సినిమా ప్రేక్షకులు అందరికి విజయ్ దేవరకొండ సుపరిచితుడే. హిందీ సినిమా ప్రేక్షకుల్లోనూ చాలా మందికి అతను తెలుసు. విజయ్ దేవరకొండకు హిందీ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో అభిమానులు ఉన్నారు. అతనితో కలిసి నటించాలని ఉందని స్టార్ కిడ్స్ & హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అడ్వాణీ మనసులో మాట బయటపెట్టారు. మరి, పదేళ్ల క్రితం? అపరిచితుడు! విజయ్ దేవరకొండ అని ఒక నటుడు ఉన్నాడని తెలుగు సినిమా పరిశ్రమలో మెజారిటీ జనాలకు తెలియదు. ఈ పదేళ్లలో విజయ్ దేవరకొండ ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అతని కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? ఆయనకు లభించిన విజయాలు ఎన్ని?


నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాప‌బుల్‌' కార్యక్రమానికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వచ్చే వరకూ... అతను చిన్నతనంలో ఒక టీవీ షో చేసిన సంగతి చాలా మందికి తెలియదు. పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో విజయ్ దేవరకొండ చదువుకున్నారు. ఆ సమయంలో సాయిబాబా మీద టీవీ షో తీస్తే... అందులో విజయ్ దేవరకొండ నటించారు. అయితే, డబ్బింగ్ ఆయన చెప్పలేదు. వేరొకరు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ బాల నటుడిగా కనిపించలేదు. హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


విజయ్ దేవరకొండ పేరు చెబితే... ఇటు తెలుగు ప్రేక్షకులకు అటు హిందీ, ఇతర భాషల ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా సాధించిన విజయం, యువతపై చూపించిన ప్రభావం అటువంటిది. సుమారు రూ. 5 కోట్లతో తీసిన ఆ సినిమా, దగ్గర దగ్గర రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. అయితే, ఆయన ఒక్క రాత్రిలో ఏమీ స్టార్ కాలేదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి పట్టుదల ఉన్నాయి. పట్టు వదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నాలు ఉన్నాయి.


'అర్జున్ రెడ్డి' కంటే ముందు 'పెళ్లి చూపులు' సినిమాతో కథానాయకుడిగా విజయ్ దేవరకొండ తొలి విజయం అందుకున్నారు. కోటి రూపాయలతో తీసిన ఆ సినిమా దగ్గర దగ్గర రూ. 30 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమాగా విడుదలైనా... భారీ విజయం సాధించింది. పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఉత్తమ చిత్రంగా నంది, నేషనల్ అవార్డులు అందుకుంది. 'పెళ్లి చూపులు' కంటే ముందు అతని ఖాతాలో మరో విజయం ఉంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో హీరో నాని స్నేహితుడిగా విజయ్ దేవరకొండ నటించారు. నటుడిగా ఆ సినిమా అతనికి పేరు తీసుకొచ్చింది. అయితే, 'ఎవడే సుబ్రహ్మణ్యం' కంటే ముందు శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లోనూ, రవిబాబు తీసిన 'నువ్విలా'లోనూ ఆయన చిన్న చిన్న పాత్రలు చేశారు. అప్పుడు ప్రేక్షకులు గుర్తించలేదు. 'అర్జున్ రెడ్డి' అనే అద్భుతం జరిగిన వాటిని గుర్తించాల్సిన అవసరం రాలేదు. కానీ, 'అర్జున్ రెడ్డి' విజయాన్ని క్యాష్ చేసుకోవాలని ఒకరు ప్రయత్నించారు.


'పెళ్లి చూపులు' కంటే ముందు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేశారు. అయితే, విడుదల కాలేదు. 'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత 'ఏ మంత్రం వేసావె' పేరుతో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శక - నిర్మాతలు. అది ఏమీ విజయ్ దేవరకొండ కెరీర్‌పై ప్రభావం చూపించలేదు. 'మహానటి', 'గీత గోవిందం' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాతే ఆశించిన విజయాలు దక్కలేదని చెప్పాలి.


'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండపై అంచనాలు పెరిగాయి. ఆయన కూడా మార్కెట్ స్పాన్ పెంచుకోవాలని చూశారు. తెలుగు, తమిళ భాషల్లో 'నోటా' సినిమా చేశారు. అది డిజాస్టర్ అయ్యింది. దక్షిణాది భాషల్లో 'డియర్ కామ్రేడ్' చేశారు. పాటలు మంచి హిట్ అయ్యాయి. 'గీత గోవిందం' తర్వాత మరోసారి రష్మికతో నటించడం ప్లస్ అయ్యింది. అయితే, కమర్షియల్ పరంగా సినిమాకు  ఆశించిన వసూళ్లు రాలేదు. అందరి నుంచి హిట్ టాక్ లభించలేదు. ఆ తర్వాత చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' కూడా ప్లాప్. అయినా... విజయ్ దేవరకొండ కెరీర్ జోరు మీద ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద ఆయన గురి పెట్టారు.


కరోనా కారణంగా విజయ్ దేవరకొండ సినిమా థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు దాటింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'లైగర్' గతేడాది విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా విజయ్‌ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించిన ఆ సినిమా ఘోరంగా విఫలమైంది. ఫలితంగా విజయ్ కొత్త ప్రాజెక్టులు కూడా దూరమయ్యాయి. పూరీతో ప్లాన్ చేసిన ‘జన గణ మన’ ఆగింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అకౌంట్‌లో ‘ఖుషీ’ మాత్రమే ఉంది. ‘లైగర్’ ఫ్లాప్‌ కవర్ చేయడం కోసం విజయ్ దేవరకొండ, ‘శాకుంతలం’ పరాజయం నుంచి బయట పడేందుకు సమంతకు ఈ మూవీ హిట్ కావడం చాలా అవసరం. లేదంటే... 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' విజయాలతో వచ్చిన మార్కెట్‌కు బీటలు పడే ప్రమాదం ఉంది. 


జీవితంలో ఒడిదుడుకులు సహజం. విజయం అనేది ఎప్పుడూ మన వెంటే ఉండదు. విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే, ప్రేక్షకుల్లో మాత్రం రౌడీ బాయ్ మీద ప్రేమ తగ్గలేదు. ఇంకా విజయ్‌కు అంత క్రేజ్ ఉండటానికి కారణం సినిమాలు, విజయాలు మాత్రమే కాదు. ఆఫ్ స్క్రీన్ ఆయన బిహేవియర్ (ప్రవర్తన) కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. విజయ్ దేవరకొండ మాటలు, చేస్తున్న పనులు యువతలో చాలా మందికి నచ్చుతున్నాయి. అభిమానుల్ని తీసుకొస్తున్నాయి.


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?


మే 9న (ఈ రోజు) విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ABP Desam తరఫున జన్మదిన శుభాకాంక్షలు. విజయ్ దేరవకొండ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ... Happy Birthday Vijay Devarakonda. 


Also Read: కాజల్ కుమారుడు నీల్‌తో కుటుంబ సభ్యుల ముద్దు మురిపాలు... ఫొటోలు