సీనియర్ నటుడు శివాజీ ప్రస్తుతం 'కోర్ట్' మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నాని నిర్మించిన ఈ సినిమాలో ఆయన కీలకపాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ ఒకప్పుడు హీరోగా రాణించిన తాను 13 ఏళ్ల గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి? నానికి తెలియకుండానే ఆయన ఎలా ఛాన్స్ ఇచ్చారు? అనే విషయాలను వెల్లడించారు. 


13 ఏళ్ల గ్యాప్ ఎందుకంటే? 


'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపైకి వచ్చిన తర్వాత శివాజీపై కాసేపు యాంకర్ సుమ ప్రశ్నల వర్షంలో ముంచెత్తింది. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ "అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. నా లైఫ్ లో 'బూచమ్మ బూచోడు' అనేది 13 ఏళ్ల క్రితం నేను చేసిన సినిమా. డీసెంట్ గా నడిచింది ఈ మూవీ. ఆ తర్వాత గ్యాప్ తీసుకోలేదు, తీసుకోవాలని లేదు, తీసుకుని వెళ్ళింది లేదు. ఎందుకో అలా ఆంధ్రప్రదేశ్ సమాజం... నా మనసును దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి, నేను పక్కకు వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ వెండితెర మీద ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది నాని. ఇది ఆయనకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు" అంటూ చెప్పుకొచ్చారు. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రితో ఎంగిలి ప్లేట్లు కడిగించిన కార్తీక్.. ఫుల్ కామెడీ.. రొమాన్స్!!


40- నుంచి 60 స్క్రిప్ట్ లు విన్నాను - శివాజీ  


శివాజీ ఇంకా మాట్లాడుతూ " డబ్బుల కోసమే అనుకుంటే నేను ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసేవాడిని. చాలామంది దగ్గరకు వెళ్లేవాడిని. నేను వెళ్లి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాక ప్రత్యేకంగా అవకాశాలే నా దగ్గరకు వచ్చాయి. అది నా అదృష్టం. అయితే సొంతంగా ఓ సినిమా చేద్దామని ప్రయత్నించినా కూడా ప్రకృతి నాకు సహకరించలేదు. కానీ మళ్లీ సినిమానే పిలిచి ఇదిగోరా ఇది నువ్వు చేయాలి అని చెప్పి అవకాశాన్ని ఇచ్చింది. బిగ్ బాస్, '90' వెబ్ సిరీస్ తర్వాత 40 నుంచి 60 స్క్రిప్టులు విన్నాను. అందులో నాకు బాగా నచ్చింది కోర్ట్ సినిమాలోని మంగపతి క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా బాగా గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్ లో, మంచి సినిమాలో నటించాలని కోరుకుంటాడు. ఆ విధంగా భగవంతుడు నాకు నాని గారి బ్యానర్ లో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నానికి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు. 


"ప్రపంచంలో ఏ సినిమా ఆడినా, అందులోనూ తెలుగు సినిమా, లేదంటే పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, పుష్ప నాని గారి ఎనీ ఫిలిమ్స్ లో కామన్ గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్. ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా హిట్ అయ్యే సినిమాలు అరుదుగా ఉంటాయి. ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. ఇది రియాలిటీ. ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతోంది అని బలంగా నమ్ముతున్నాను. నాని దర్శకుడు నమ్మి ఈ సినిమాను ఆయన మీద వదిలేసారు. నేనది ఆర్పీ చౌదరి గారి సినిమాలో చూశాను. ప్రొడక్షన్ అనేది చేయాలని నాకు చాలా కోరిక. కానీ అందరికీ అయ్యే పని కాదు. ఈ ప్రొడక్షన్ నుంచి ఇంకా చాలామంది కొత్త దర్శకులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ పూర్తి చేశారు శివాజీ. 


నటుడు, నిర్మాత నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కోర్ట్'. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తుండగా, హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ మూవీ ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.


Also Read: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ 'తండేల్' - ఒకే రోజు స్ట్రీమింగ్ అవుతోన్న 20 సినిమాలు.. చూసి ఎంజాయ్ చెయ్యండి!